తెలంగాణలోని ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య యుద్ధమే నడుస్తోంది. యాసంగిలో వరి వేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌కు ముందే చెప్పినా.. తెలంగాణ బీజేపీ నేతల హామీలతో కొంతమంది వరి వేశారు. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఆరుతడి పంటలు వేసుకున్నారు. తీరా ఇప్పుడు యాసంగి పంట చేతికివచ్చే సమయానికి ధాన్యం కొనుగోలు విషయం చినికి చినికి గాలివానలా మారింది. యాసంగిలో పండించిన పారాబాయిల్డ్ రైస్‌ను కేంద్రం కొనుగోలు చేయాలని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగి ధర్నాకు పూనుకున్నారు.
అంతేకాకుండా ప్రధాని మోడీకి మిగితా రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్న విధంగానే తెలంగాణలో సైతం ధాన్యం కొనుగోలు చేయాలని లేఖలు సంధించారు. దీంతో పాటు తెలంగాణ మంత్రులను కేంద్రమంత్రులతో ధాన్యం కొనుగోలు విషయమై ముచ్చటించమని, కేంద్రాన్ని ఒప్పించాలని హస్తినాకు పంపారు. ఎన్నిసార్లు కేంద్రమంత్రులను కలిసి ధాన్యం కొనుగోలు విషయమై మొరపెట్టుకున్నా.. కేంద్రమంత్రులు మాత్రం ససేమిరా అన్నారు. అసలు కేంద్రం చెబుతున్న మాటమేటి.. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న కోర్కెలు ఏమిటి.. ఇంతకు మిగితా సీజన్లలో రాని కొనుగోలు కొట్లాట యాసంగి సీజన్లో మాత్రం ఎందుకు వచ్చింది.?
వాస్తవానికి యాసంగిలో ఎండవేడిమికి వరి ధాన్యం పారాబాయిల్డ్ రైస్‌గా మాత్రమే వినియోగానికి వస్తుంది. ఒక వేళ బాయిల్డ్ రైస్‌గా కాకుండా.. మిల్లుల్లో రా రైస్ గా మార్చితే.. అధిక శాతం నూకలు వస్తాయి. క్వింటల్ వరి మిల్లులో ఆడిస్తే..సుమారు 70 శాతం నూకలు రాగా.. 30 శాతం రా రైస్ వస్తుంది. అదే.. బాయిల్డ్ రైస్ పద్ధతిలో వరిని మిల్లులో ఆడిస్తే దిగుబడిలో తక్కువ శాతం నష్టం వాటిల్లుతుంది. కాబట్టి మిల్లర్లు యాసంగిలో వచ్చే ధాన్యాన్ని బాయిల్డ్ చేసి ఉప్పుడు బియ్యాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్ కింద ఇస్తే ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఇతర దేశాల్లో బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ ఉన్నట్లు… లాక్‌డౌన్ సమయంలో బాయిల్డ్ రైస్ అధికంగా ఎగుమతులు చేసినట్లు కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. కానీ.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రా రైస్ మాత్రమే కొంటామని తేల్చిచెప్పింది.
తెలంగాణతో పాటు తమిళనాడు, ఒడిశా, కేరళలు సైతం డిమాండ్ చేస్తున్నాయనే విషయం గుర్తుంచుకోవాలని, బాయిల్డ్‌రైస్‌కు 113 దేశాల్లో డిమాండ్ ఉందని ఎగుమతులు చెబుతున్నాయని టీఆర్ఎస్ మంత్రులు లెక్కలు వెల్లడిస్తున్నారు. నాన్ బాస్మతి బియ్యం ఎగుమతుల్లో బాయిల్డ్ రైస్ వాటా 13% ఉందని.. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి ఎందుకు కొనుగోలు చేయడం లేదని టీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాకుండా యాసంగిలో వరి వేయవద్దని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించినప్పటికీ.. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం వరి వేసుకొండని.. ధాన్యం కొనుగోలు చేసేది కేంద్రం మాత్రమేనని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల మాటలు నమ్మిన కొందరు రైతులు వరి పంటవేసుకున్నారు.
ఇప్పుడెమో బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్రం చెప్పడంతో ధాన్యం కొనుగోలు వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చింది. అయితే ప్రస్తుతానికి తెలంగాణలో రాష్ట్రా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు కేంద్రంపై ధాన్యం కొనుగోలు చేసేందుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రేపు హస్తిన వేదికగా కేంద్రానికి ధాన్యం కొనుగోలుపై నిరసన సెగలు పుట్టించేందుకు టీఆర్‌ఎస్ వర్గాలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాయి. అంతేకాకుండ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. రేపు టీఆర్‌ఎస్ ఆందోళనతో ఢిల్లీ దద్ధరిల్లి.. కేంద్రం దిగివస్తుందో చూడాలి మరి.