దూకుడు రాజకీయాలకు రేవంత్ రెడ్డి పెట్టింది పేరు. ఆ వ్యక్తిత్వమే ఆయన్ను రాజకీయంగా ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టింది. కాంగ్రెస్ లో ఎంతమంది హేమాహేమీలున్నా వారందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ అతడికి టీపీసీసీ కట్టబెట్టింది. ప్రజల్లో ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం ఉంది. అయితే ఈ దూకుడే ప్రస్తుతం ఆయన కొంప ముంచేటట్లు కన్పిస్తుంది. ముందువెనుక చూసుకోకుండా ఆయన సొంత పార్టీ నేతపై చేసిన విమర్శలు ఆయనకు కొత్త చిక్కులు తీసుకొచ్చేలా కన్పిస్తున్నాయి.
ఇటీవల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్లో పర్యటించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు.. ప్రాజెక్టుల విజన్ తదితర వివరాలను అధికారులు ఈ కమిటీకి అందజేశారు. ఇన్నోవేషన్ రంగంలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ వివరాలు.. టీ హబ్.. వీ హబ్.. అగ్రి హబ్.. బీ హబ్.. రిచ్.. టీ వర్క్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను కమిటీకి వివరించారు. డిజిటల్ గవర్నెన్స్ సేవలు.. ఇన్నోవేషన్ రంగంలో ఇంకుబేటర్ల ఏర్పాటు.. టీ ఫైబర్ ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను శశిథరూర్ తెలుసుకుని ప్రశంసలు కురిపించారు.
ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో రేవంత్ ను యాంకర్ ప్రశ్నించగా ఆయన నోరుజారారు. శశిథరూర్ ను గాడిదం అంటూ సంబోధించాడు. దీనిని మంత్రి కేటీఆర్ శశిథరూర్ తోపాటు రాహుల్ గాంధీకి ట్వీటర్లో ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డిపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగిన శశిథరూర్ ను రేవంత్ అసభ్యంగా ‘గాడిద’ అని సంబోధించడం రాజకీయంగా దూమారం రేపింది.
ఈ విషయంలో రేవంత్ రెడ్డి అధిష్టానం ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి దిగిరాక తప్పదు. చివరికి శశిథరూర్ కు ఫోన్ చేసి క్షమాపణలు కోరాల్సి వచ్చింది. దీనికి ఆయన సైతం ఒకే అన్నట్లు తెలుస్తోంది. కాగా రేవంత్ రెడ్డికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలామంది వ్యతిరేకులున్నారు. ఇలాంటి సమయంలో సొంతపార్టీ నేతపైనే ఆయన విమర్శలు చేయడం వారికి కలిసొచ్చింది. అదే అదనుగా నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్ని అజ్యం పోస్తున్నారు.
శశిథరూర్ వ్యక్తిత్వం రాజకీయాల్లో అందరికీ ఆదర్శమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లో సీనియర్ నేత అయినా ఆయనపై రేవంత్ వ్యాఖ్యలు తనను ఎంతోగానో బాధించాయని పేర్కొన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి దూకుడు కారణంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు కన్పిస్తుంది. అన్నివేళలా దూకుడు మంచిది కాదని రేవంత్ ఈ ఇష్యూతో అర్థమైనట్లే కన్పిస్తుంది. ఏదిఏమైనా రేవంత్ రెడ్డి ఎవరు మనవాళ్లు.. ఎవరు పరాయివాళ్లు అనేది తెలుసుకొని దూకుడు చూపిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.