జీవితం అన్న తర్వాత కడుపు నిండాలంటే ఉద్యోగం చేయాల్సిందే. అయితే ఉద్యోగం చేసేవాళ్లు ఆఫీసుకు ఒక్కోసారి లేటుగా వెళ్తుంటారు. లేటుగా ఎందుకొచ్చావని కారణం అడిగితే సవాలక్ష చెప్తారు. ట్రాఫిక్ ఉందని.. బస్సు దొరకలేదని.. బండి చెడిపోయిందని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తారు. పైగా ఆఫీసు అన్నాక ఓ నిమిషం అటూ ఇటు అవుతుందని బాస్‌లతో వాదిస్తారు. ఇదిలా ఉంచితే.. తాజాగా ఓ ఆఫీస్‌కు చెందిన సర్క్యులర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ నోటీసులో ఏముందంటే.. ‘ఆఫీస్‌కు ఆలస్యంగా వస్తే ప్రతి నిమిషానికి 10 నిమిషాల చొప్పున అదనంగా పని చేయాల్సి ఉంటుంది’ అంటూ యాజమాన్యం పేర్కొంది. ఉదాహరణకు ఆఫీస్ టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుకుంటే… ఉద్యోగి 10:02 గంటలకు ఆఫీస్‌కు వస్తే సాయంత్రం 6:20 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీస్ చూసిన నెటిజన్‌లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి కంపెనీలు అనతికాలంలోనే నష్టపోతాయని కొందరు.. ఉద్యోగుల్లో క్రమశిక్షణ రావాలంటే ఈ మాత్రం డోసు ఉండాల్సిందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే అలాంటి ఆఫీసుల్లో ఎవరు పనిచేస్తారంటూ కొందరు నెటిజన్‌లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది ఏ కంపెనీకి చెందిన రూల్.. ఈ కంపెనీ ఎక్కడ ఉంది అన్న వివరాలు తెలియరాలేదు.
Viral: పక్షులకు ఆహారం పెడుతోన్న వృద్ధుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు