రెయిన్‌బో (ఇంద్రధనస్సు) అంటే ఏమిటో అందరికీ తెలుసు. వర్షం పడినప్పుడు సూర్యకిరణాల వల్ల మబ్బుల మీద కనపడే ఏడు రంగుల హరివిల్లు. ఈ ప్రక్రియ సహజసిద్ధంగా ఏర్పడుతుంది. అయితే.. అచ్చం రెయిన్‌డో లాగా మూన్‌బో (చంద్రధనస్సు) కూడా ఏర్పడుతుందన్న సంగతి మీకు తెలుసా? ఇది కూడా సహజసిద్ధంగానే ఏర్పడుతుంది. దీనికి మూన్ రెయిన్‌బో లేదా లునార్ రెయిన్‌బో అని కూడా అంటారు. చందమామ నుంచి వెలువడే కాంతి, నీటి బిందువులతో వక్రీభవనం చెందినప్పుడు ఇది ఏర్పడుతుంది. అయితే.. చంద్రుని ఉపరితలం నుంచి తక్కువ మొత్తం కాంతతి ప్రతిబింబించడం కారణంగా.. మూన్‌బో ఏర్పడినప్పుడు చివర ఉండే రంగులు మసకబారినట్లు కనిపిస్తాయి.
మరి.. ఈ మూన్‌బో ఎక్కడ ఏర్పడుతుంది? జలపాతాల వద్ద! జలపాతాలు పలుచగా ఉండే పొగమంచుని సృష్టిస్తాయి. ఈ పొగమంచులో మూన్‌బోను స్పష్టంగా చూసేందుకు సాధ్యమవుతుంది. ముఖ్యంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతమైన విక్టోరియా జలపాతం వద్ద ఈ మూన్‌బో తరచుగా ఏర్పడుతుంది. దీనిని వీక్షించేందుకు అక్కడికి వేలమంది వెళ్తుంటారు. అందుకే, మూన్‌బోకు ఈ విక్టోరియా జలపాతం ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. పౌర్ణమి నాడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. చాలావరకు ఇది రాత్రి సమయంలో తెలుపు రంగులోనే కనిపిస్తుంది.