Kerala Woman Mustache: సాధారణంగా మీసాలు అబ్బాయిలకే ఉంటాయి. అమ్మాయిలకు ఉండవు. ఒకవేళ పెదవిపై కాస్త వెంట్రుకలు కనిపించినా లేడీస్ ఆందోళన పడుతుంటారు. వెంటనే వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. అయితే ఆడవారికి మీసాలు వస్తే అది హార్మోన్‌ల ప్రభావమే అని వైద్యులు చెప్తుంటారు. హార్మోన్‌ల సమతుల్యం దెబ్బతినడంతో ఆడవారిలో ఈ సమస్య కనిపిస్తుందని వారు వివరిస్తున్నారు. కట్ చేస్తే.. ఓ యువతి మాత్రం తనకు మీసమే అందమని మురిసిపోతోంది. తన మీసాన్ని అందంగా దువ్వుకుని మరీ తిరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కన్నూరు ప్రాంతానికి చెందిన శైజ (35) అనే యువతికి పెదవిపై దట్టంగా వెంట్రుకలు పెరిగిపోయాయి. దీంతో ఆ వెంట్రుకలను తొలగించుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు సూచించారు. కానీ శైజ మాత్రం వారి మాట వినలేదు. తాను తన మీసాన్ని అలాగే ఉంచుకుంటానని.. ఆ మీసం వల్ల తనకు పోయేదేమీ లేదని స్పష్టం చేసింది. పైగా తనకు మీసం ఉండటం పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు వివరించింది.
Read Also: Lucky Family: అదృష్ట కుటుంబమంటే ఇదే.. అప్పులతో కాసేపట్లో ఇల్లు అమ్మాల్సిన స్థితిలో..
ఐదేళ్ల క్రితం నుంచే తనకు మీసం కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తోందని.. అయితే తన మీసం చూసి చాలా మంది తనను తేడాగా చూసేవాళ్లు అని.. తన మీసంతో చాలా సమస్యలు కూడా ఎదుర్కొన్నట్లు శైజ ఆవేదన వ్యక్తం చేసింది. కానీ తనను అవమానంగా, అనుమానంగా చూసిన వాళ్లు తన ఉద్దేశాన్ని మాత్రం మార్చలేరని తెలిపింది. తన మీసం తన ఇష్టమని.. తన మీసమంటే తనకు చాలా ప్రేమ అని పేర్కొంది. వాట్సాప్ డీపీలో కూడా తాను మీసం ఉన్న ఫోటోనే పెట్టుకున్నానని వివరించింది. నిజానికి కరోనా సమయంలో తన మీసం కవర్ అవుతుందని మాస్క్ పెట్టుకోవడం కూడా తనకు నచ్చలేదని శైజ చెప్పింది. మీసంతో తాను అందంగా లేనని భావించడం లేదని.. తాను రెగ్యులర్‌గా ఐబ్రోస్ చేయించుకుంటాను కానీ మీసకట్టు తీసివేయాలన్న ఆలోచన ఎప్పుడూ కలగలేదని స్పష్టం చేసింది.