Today (08-02-23) Business Headlines:
కెనరా బ్యాంక్ హెడ్’గా సత్యనారాయణరాజు
ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ డైరెక్టర్ మరియు సీఈఓగా సత్యనారాయణరాజును నియమించారు. ఈ నిర్ణయం నిన్న మంగళ వారం నుంచే అమల్లోకి వచ్చింది. బ్రాంచ్ బ్యాంకింగ్, కార్పొరేట్ క్రెడిట్, రిటైల్ క్రెడిట్, అగ్రి ఫైనాన్సింగ్, క్రెడిట్ మానిటరింగ్, క్రెడిట్ రికవరీ వంటి విభాగాల్లో సత్యనారాయణరాజును నిపుణుడని చెప్పొచ్చు. అంత మంచి అనుభవం ఆయన సొంతం. బ్యాంకింగ్ సర్వీసులు, ప్రొడక్టుల డిజిటైలేషన్’లో కూడా సత్యనారాయణరాజు తనదైన ముద్ర వేశారు. దాదాపు రెండేళ్ల కిందట కెనరా బ్యాంక్ ఈడీగా వచ్చారు.
లేజీ పే సహా పలు ఫిన్’టెక్ వెబ్’సైట్లు బ్లాక్
లేజీ పే, ఇండియా బుల్స్ హోమ్ లోన్, కిస్త్ తదితర వెబ్’సైట్’లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. బడ్డీ లోన్, క్యాష్’టీఎం, క్రెడిట్ బీ, ఫెయిర్సెంట్, ట్రూ బ్యాలెన్స్ వంటివి కూడా ఈ లిస్టులో ఉన్నట్లు సమాచారం. చైనాతోపాటు ఇతర దేశాల సంస్థలు నిర్వహిస్తున్న దాదాపు 230కి పైగా యాప్’లను కేంద్రం బ్లాక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బెట్టింగ్, గ్యాంబ్లింగ్’తోపాటు అనుమతి లేకుండా లోన్లు ఇస్తున్నందున వాటిని ఇలా కట్టడి చేసినట్లు పేర్కొంటున్నారు.
యూపీఐతో రూపే క్రెడిట్ కార్డు అనుసంధానం
ఇప్పటివరకు యూపీఐతో ఏటీఎం కార్డులను మాత్రమే అనుసంధానం చేసి పేమెంట్లు నిర్వహించగా ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేసినట్లు పేటీఎం సంస్థ పేర్కొంది. కస్టమర్లు ఈజీగా పేమెంట్లు పూర్తి చేసేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. యూపీఐ అకౌంట్’కి క్రెడిట్ కార్డును ఒక్కసారి లింక్ చేసుకుంటే క్యూఆర్ కోడ్’ని స్కాన్ చేసి చెల్లింపులు చేయొచ్చు. ఇన్నాళ్లూ ఈ సౌలభ్యం లేకపోవటం వల్ల క్రెడిట్ కార్డును స్వైప్ చేయాల్సి వచ్చేది. క్రెడిట్ కార్డులోని డబ్బులను ఇతర మార్గాల్లో తీసుకునేందుకు ఎక్కువ ఛార్జీలను చెల్లించేవారు.
2025 నుంచి జర్మనీకి గ్రీన్ అమ్మోనియా సరఫరా
మన దేశంలో మొట్టమొదటి డిస్పాచబుల్ రెనివబుల్స్ కంపెనీ అయిన గ్రీన్ కో గ్రూపు.. జర్మనీలోని యూనిపర్ సంస్థకు గ్రీన్ అమ్మోనియాను సప్లై చేయనుంది. ఈ మేరకు రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం 2025 నుంచి ఈ సరఫరా ప్రారంభం కానుంది. ఈ తరహా ఎగుమతులు చేయనున్న తొలి ఇండియన్ కంపెనీగా గ్రీన్ కో గ్రూపు నిలవనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్’లోని కాకినాడ యూనిట్ నుంచి గ్రీన్ అమ్మోనియాను సప్లై చేయనున్నట్లు చెప్పారు.
రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన జీవీకే
ముంబై విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను అదానీ గ్రూపుకి ఇచ్చే విషయంలో తమను బెదిరించారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను జీవీకే సంస్థ తోసిపుచ్చింది. అదానీ గ్రూపు గానీ ఇతరులు గానీ తమపై ఎలాంటి ఒత్తిడీ తేలేదని జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి స్పష్టం చేశారు. ముంబై ఎయిర్ పోర్టు మేనేజ్మెంట్ ని 2021లో జీవీకే నుంచి అదానీ గ్రూపు టేకోవర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ మరియు ఈడీ ద్వారా కేంద్ర ప్రభుత్వం జీవీకేని బెదిరించినట్లు రాహుల్ గాంధీ.. నిన్న.. లోక్ సభలో ఆరోపించారు.
గతేడాది 10 వేలకు పైగా ఎంఎస్ఎంఈలు క్లోజ్
2022-23 ఆర్థిక సంవత్సరంలో పది వేల 655 మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్’లు మూతపడ్డాయి. గడచిన నాలుగేళ్లలో ఇంత భారీ సంఖ్యలో ఎంఎస్ఎంఈలు క్లోజ్ కావటం ఇదే మొదటిసారి అంటున్నారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్’గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్’ని పునరుద్ధరించారు. ఈ పథకం కింద ఎంఎస్ఎంఈలకు అదనంగా రెండు ట్రిలియన్ రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ క్రెడిట్’ని కొల్లేటరల్ ఫ్రీగా ఇస్తుండటం గమనించాల్సిన విషయం.