India Growth: మన దేశం వచ్చే ఏడాది 5 శాతం గ్రోత్ సాధించినా గొప్ప విషయమేనని, అదే జరిగితే మనం అదృష్టవంతులమేనని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ అన్నారు. ఈ ఏడాదితో పోల్చితే వచ్చే సంవత్సరం మరింత కష్టంగా గడవనుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి వేగం మందగించబోతోందని అంచనా వేశారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూపోతున్నాయని, అందుకే గ్రోత్ పడిపోనుందని అభిప్రాయపడ్డారు.
ఇండియా కూడా దీనికి మినహాయింపు కాదని కుండబద్ధలు కొట్టారు. మన దేశంలో ఒక వైపు వడ్డీ రేట్లు పెరుగుతుంటే మరో వైపు ఎగుమతులు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. నింగినంటుతున్న నిత్యవసర సరుకుల ధరలు, కూరగాయల రేట్లతో పోల్చితే దేశ ద్రవ్యోల్బణం పెద్ద సమస్యే కాదని అన్నారు. అభివృద్ధి కుంటుపడటానికి ఇది కూడా కారణం కాబోతోందని రఘురామ్ రాజన్ వివరించారు.
read also: Today(21-12-22) Business Headlines: కేటీఆర్ దావోస్ పర్యటనతోపాటు మరిన్ని బిజినెస్ ముఖ్యాంశాలు
ఇండియా ఎకనమిక్ గ్రోత్ కొవిడ్ ముందు నాటి పరిస్థితుల కన్నా ఘోరంగా పతనమవుతోందని, ఇప్పటికే 9 నుంచి 5కి పడిపోయిందని తెలిపారు. కరోనా టైంలో ఎగువ మధ్యతరగతివాళ్లు ఇబ్బందిపడలేదని, వాళ్లు తమ పని తాము చేసుకున్నారని వెల్లడించారు. మహమ్మారి వల్ల ఎటొచ్చీ పేదలే తీవ్ర కష్టాల పాలయ్యారని, పరిశ్రమలు మూతపడటం వల్ల వాళ్ల ఉద్యోగాలు ఊడాయని, దీంతో పూట గడవని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదాయం లేకపోవటంతోపాటు అప్పులు పెరిగిపోయి దిగువ మధ్యతరగతి జనాల బాధలు వర్ణనాతీతంగా మారాయని గుర్తుచేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించకూడదని, గుత్తాధిపత్యమే దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని హితవు పలికారు. చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలుగా ఎదగాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ సూచించారు.