Today(21-12-22) Business Headlines:
దావోస్‌కు మంత్రి కేటీఆర్: తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కి వెళ్లనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు. ఇండియా నుంచి దాదాపు వంద మందికి పైగా హాజరుకానున్న ఈ సదస్సుకు తెలంగాణ నుంచి ప్రస్తుతానికి కేటీఆర్ పేరు ఒక్కటే తెర మీదికి వచ్చింది. పలువురు కేంద్ర మంత్రులు, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతోపాటు అంబానీ, అదానీ వంటి వ్యాపార దిగ్గజాలు కూడా మన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.
విశాఖ ఇండస్ట్రీస్ విస్తరణ
వీ-నెక్‌స్ట్ అనే బ్రాండ్ నేమ్‌తో సిమెంట్ ఫైబర్ బోర్డులను విక్రయించే తెలంగాణ సంస్థ విశాఖ ఇండస్ట్రీస్.. పశ్చిమ బెంగాల్‌లో మరో ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తోంది. ఈ కంపెనీకి ఇది ఐదో ప్లాంట్ కాగా ఆ రాష్ట్రంలోని మేదినిపూర్ జిల్లాలో రెండోది కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ ప్లాంట్ నిర్మాణానికి 130 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. 2023 ఆగస్టు నాటికి ప్రొడక్షన్ ప్రారంభమవుతుందని విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ వంశీ గడ్డం చెప్పారు. కొత్త ప్లాంట్ కెపాసిటీ 84 వేల టన్నులు కాగా దీనివల్ల సంస్థ మొత్తం సామర్థ్యం మూడున్నర లక్షల టన్నులకు పెరుగుతుందని పేర్కొన్నారు.
సౌతిండియాకి జపాన్ సంస్థ
ఇళ్ల నుంచి వెలువడే వేస్ట్ వాటర్‌ని ప్యూరిఫై చేసి మళ్లీ వాడుకునేందుకు వీలుగా మలిచే సంస్థల్లో జపాన్ కంపెనీ దైకీ యాక్సిస్‌కి మంచి పేరుంది. ఈ సంస్థ ఇప్పుడు ఇండియాలో మూడో ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గుజరాత్, హర్యానాల్లో ఇప్పటికే రెండు ప్లాంట్లు ఉండగా మూడో ప్లాంట్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు కర్ణాటక, తమిళినాడులతో చర్చలు జరుపుతోంది. సంప్రదింపులు ఫలిస్తే 200 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 2023లోనే ప్లాంట్ పనులు మొదలుపెట్టాలని ఆశిస్తోంది.
క్రీడా రంగం బడ్జెట్ పెంచండి
క్రీడా రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు పెంచాలని లోక్‌సభ ఎస్టిమేట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మరీ ముఖ్యంగా కొవిడ్ అనంతరం ఈ సెక్టార్‌కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది. ఇండియా.. స్పోర్టింగ్ సూపర్ పవర్‌గా ఎదగటానికి సర్కారు సాయం చేయాలని పేర్కొంది. ఇతర రంగాలకు ఇస్తున్న బడ్జెట్‌తో పోల్చితే క్రీడలకు కేటాయిస్తున్నది చాలా చాలా తక్కువని అంచనాల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై క్రీడల శాఖ బదులిస్తూ.. కమిటీ సిఫారసులను నోట్ చేసుకున్నామని తెలిపింది.
10% పెరగనున్న రీఛార్జ్‌లు
ఎయిర్‌టెల్, జియో టారిఫ్‌లు త్వరలో 10 శాతం పెరగనున్నాయని బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంతోపాటు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ హైక్స్ ఉంటాయని లేటెస్ట్ రిపోర్ట్‌లో తెలిపింది. గతంలో ఛార్జీలు పెంచటం వల్ల టెల్కోలకు ప్రయోజనాలు చేకూరినప్పటికీ వాటి రెవెన్యూ మరియు మార్జిన్లు ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. సబ్‌స్క్రైబర్లు మరియు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ రిక్వెస్టులు పెరగటం ఇండియన్ టెలికం సెక్టార్‌లో పోటీ పెరుగుతోందనటానికి నిదర్శనమని గుర్తుచేశారు.
ఉక్రెయిన్‌కి ఐఎంఎఫ్ సపోర్ట్
రష్యా యుద్ధం వల్ల అన్ని విధాలా తీవ్రంగా అతలాకుతలమైన ఉక్రెయిన్‌ని ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ముందుకొచ్చింది. ఆ దేశ స్థూల ఆర్థిక స్థిరత్వానికి తన వంతు మద్దతులో భాగంగా కొత్త కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉక్రెయిన్ బడ్జెట్ ఆదాయాలను సమీకరించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రభుత్వ యాజమాన్య సంస్థల నిర్వహణ పారదర్శకతను మరియు ప్రభావాన్ని మెరుగుపరచడం వంటివి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉక్రెయిన్ వెల్లడించింది.