కరోనా వైరస్ మహమ్మారి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కలెక్టర్లు… మీ పరిధిలో ఉన్నవి మీరు చేయండి. లేనివి మా దృష్టికి తెస్తే మా ప్రయత్నం మేము చేస్తాం. మీ కృషికి మేము అండగా నిలవాలన్నదే మా తాపత్రయం. ప్రైవేట్ హాస్పిటల్ లో చేరుకున్నది కూడా మన ప్రజలే కాబట్టి వారికి ఆక్సిజన్ సరఫరా చేసే అవకాశం ఉంటే చేయాలి. కరోనా తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసారు. మీకు ఏ కొరత ఉన్నా మా దృష్టికి రాతపూర్వకంగా తీసుకురండి. వైద్యశాఖ మంత్రి, అధికారులతో నిత్యం మాట్లాడుతున్నాం. వీలైనంత వరకు కొరత లేకుండా చేస్తాము. ఐసోలేషన్ కేంద్రాలు ఎక్కువగా పెట్టాలి. ప్రతి మండల కేంద్రంలో ఈ కేంద్రాలు పెట్టీ ఆశా వర్కర్లు, అంగన్వాడి లను పెట్టీ వచ్చే వారికి భరోసా కల్పించాలి. ధైర్యం కల్పించడం చాలా ముఖ్యం. 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అన్నారు కానీ రాష్ట్రానికి ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మస్కులు డ్వాక్రా సంఘాలు తో చేయించి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. ఎక్కువగా హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎన్ని విధాల అయితే అన్ని విధాలా ప్రజలను ఆదుకోవాలి. ఎంజీఎం 1250 బెడ్లను పూర్తిగా కోవిడ్ హాస్పిటల్ గా చేస్తున్నాం. ఎంజీఎం హాస్పిటల్ లో ఆక్సిజన్ ఇబ్బంది లేదు. ఇక్కడ ఎక్కువ రోగులు చనిపోతున్నారని తప్పుడు వార్తలు వస్తున్నవి. డాక్టర్లు సెలవులు లేకుండా పని చేయాలని కోరుతున్నాను. పోలీస్ సిబ్బంది సహకారం తీసుకోండి. మాస్క్ లు లేకపోతే ఫైన్ వేయడం కచ్చితంగా అమలు చేయాలి. గుంపులు, గుంపులు తిరగకుండా కట్టడి చేయాలి. రోగులను పట్టించుకోని, వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలని అందరినీ కోరుతున్నాను అని అన్నారు.