గతేడాది మార్చి 7న గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు అత్యవసర కోవిడ్ మందులతో కూడిన విమానం ప్రయాణం చేసింది. అయితే, గ్వాలియర్ రన్‌వైపై దిగే సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానం చాలా వరకు డ్యామేజ్ కావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పైలట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పైలట్ అక్తర్ నిర్లక్ష్యం కారణంగానే విమానం ప్రమాదానికి గురైందని, విమానం ప్రమాదం కారణంగా సుమారు రూ. 85 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, విమానం రిపేర్ కోసం ప్రభుత్వం రూ. 23 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొన్నది. ఈ నష్టాన్ని పైలట్ భరించాలని చెప్పి రూ. 85 కోట్ల కు సంబంధించిన నోటీసులు పంపింది.
Read: గుడ్‌న్యూస్: టీకాలతోనే మెరుగైన రక్షణ…
దీంతో పైలట్ అక్తర్ షాక్ అయ్యాడు. విమానంలో సాంకేతికపరమైన లోపాలు ఉన్నాయని, ఆ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇన్సూరెన్స్ కూడా లేదని, ఇన్సూరెన్స్ లేని విమానాన్ని ఎలా నడిపేందుకు అనుమతి ఇచ్చారని పైలట్ అక్తర్ ప్రశ్నించారు. దీనిపై తాను న్యాయపరమైన పోరాటం చేస్తానని అక్తర్ అంటున్నాడు. ఇక డీజీసీఏ పైలట్ అక్తర్ లైసెన్స్ ను కూడా రద్దు చేయడంతో న్యాయపరమైన పోరాటానికి అక్తర్ సిద్దమవుతున్నాడు.