తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని… అరాచకాలను ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారని ఫైర్ అయ్యారు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇప్పుడు తెలంగాణ వాదులు, ప్రజా స్వామ్యవాదులకి ఏకైక వేదిక బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. 18 ఏళ్ళు నిండిన భారత ప్రజలందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనను వ్యతికించిన ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులను అణిచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందని… వాళ్ళ కెబినెట్ లో కీలక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ కే భద్రత లేని పరిస్థితులు సృష్టించారని పేర్కొన్నారు.
జర్నలిస్టు రఘును పట్టా పగలు దొంగల్లాగా పోలీసులే కిడ్నాప్ చేశారని.. టీఆరెస్ నాయకుల కబ్జాలను వెలికితీస్తే కిడ్నాప్ చేస్తారా అని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక మంత్రికి స్థాయి వ్యక్తికి, జర్నలిస్టులకు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మృగశిర ప్రారంభమైనా ఇంకా చాలా చోట్ల ధాన్యం కల్లాల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి ధాన్యం తడిసి పోయి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని సంజయ్ అన్నారు. ప్రధాని ప్రకటించిన ఫ్రీ వ్యాక్సిన్ సకాలంలో ప్రజలకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని సూచించారు.