ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది.. మాటల యుద్ధమే కాదు.. చివరకు దాడులకు వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, ఇప్పుడు ఓవైపు టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తుంటే.. మరోవైపు టీడీపీ వ్యవహారశైలికి వ్యతిరేకంగా కౌంటర్ దీక్షలు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడంలేదు.. శనివారం రోజు ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కేంద్ర హోంశాఖ దృష్టికి దాడుల విషయాన్ని తీసుకెళ్లిన చంద్రబాబు.. హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై.. రాష్ట్రంలోని పరిస్థితిని వివరించేందుకు రెడీ అవుతున్నారు.. ఇదే సమయంలో వైసీపీ కూడా ఢిల్లీ బాట పట్టనుంది.. దీంతో.. ఏపీలో రాజకీయ సెగ కాస్త ఢిల్లీని తాకినట్టు అవుతుంది.
టీడీపీపై సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయనుంది.. టీడీపీ గుర్తింపు రద్దు చేయమని ఈసీని కోరేందుకు రెడీ అవుతోంది.. సోమవారం తర్వాత ఈసీకి వైసీపీ నేతలు లేఖ అందించనున్నట్టుగా సమాచారం.. ఇక, ఈ లేఖ ద్వారా కీలకమైన అంశాన్ని లేవనెత్తనుంది వైసీపీ.. రాజకీయ పార్టీల నేతలు బూతులు మాట్లాడుతున్న అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లనుంది.. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నికల వేళ మాత్రమే నేతలు ఉపయోగించే భాష పై ఈసీ కట్టడి ఉంటుంది.. ఆ తర్వాత నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా నియంత్రణ వ్యవస్థ లేని విషయాన్ని ఈసీకి వివరించనుంది వైసీపీ. ఎన్నికల ప్రక్రియ లేని సందర్భాల్లోనూ నేతల భాషను ఈసీ కట్టడి కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరనున్నట్టుగా తెలుస్తోంది. తాజా టీడీపీ బూతుల ఎపిసోడ్ తో పాటు ఈమధ్య కాలంలో ఆ పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన మీడియా క్లిప్పింగ్స్, వీడియో ఫూటేజ్ ఆధారాలతో సహా ఈసీకి సమర్పించేందుకు వైసీపీ సిద్ధం అవుతోంది.