అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనూహ్యంగా సంఘీభావం తెలిపారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ నవంబర్ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు రైతులు.. 45 రోజుల పాటు నిర్వహించాలని.. డిసెంబర్ 15వ తేదీకి తిరుమలకు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి.. అయితే, ఈ పాదయాత్రకు వైసీపీ నేతలు రాజకీయాలను అంటగడుతూ వచ్చారు.. కానీ, ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే సంఘీభావం తెలపడం చర్చగా మారింది..
ఇవాళ ఉదయం రైతుల విరామ శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇంకో వారం రోజులు మా నెల్లూరు జిల్లాలోనే ఉంటారు.. మీకు ఎటువంటి ఇబ్బంది అయినా నాకు వెంటనే ఫోన్ చేయండి అని భరోసా ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.. మహిళలను ఆప్యాయంగా పలకరించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. వరద బాధితుల పరామర్శ పర్యటన మధ్యలో రాజధాని రైతులని కలిశా… వర్షాల వల్ల ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయమని అందరికీ ఫోన్ నంబర్ ఇచ్చానని తెలిపారు.. మహిళా రైతులు అమరావతికి మద్దతివ్వమని కోరారు… పార్టీ ఏ స్టాండ్ లో వెళ్తే.. అదే నా స్టాండ్ అని చెప్పానన్నారు.. రూరల్ నియోజకవర్గం పరిధిలో వరదలు, వర్షాల వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకూడదు అనేది నా ఉద్దేశం.. అదే మానవత్వం, సంస్కారం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.