సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మాటల మంటలు రేపారు.. సినిమా సమస్యలతోపాటు రాజకీయ అంశాలను లేవనెత్తారు. వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ సంధించిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు వైసీపీ మంత్రులు, నేతలు, సానుభూతి పరులు రంగంలోకి దిగారు. ప్రతీగా జనసైనికులు సైతం నిరసనలకు దిగడంతో తెలుగు రాజకీయం రంజుగా సాగింది. దీంతో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది.
గత కొద్దిరోజులుగా ఇదే ఇష్యూపై ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానాన్ని ఇండస్ట్రీ పెద్దలే కోరారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెబుతున్నారు. అయితే పవన్ మాత్రం ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మడం ఏంటని నిలదీస్తున్నారు. సినీ కార్మికులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిపై పరుష పదజాలం ఉపయోగించడం విమర్శలకు తావిచ్చింది.
దీంతో సదరు మంత్రి సైతం పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనికి కౌంటర్ గా జనసేన నేతలు ఆయన కాన్వాయ్ ను అడ్డుకోవడం వంటి నిరసనలు చేశారు. ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీలోని వారంతా రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. ఆయన వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ సీని పెద్దలు లేఖ విడుదల చేశారు.
ఇదే సమయంలో నిన్న మంత్రి పేర్ని నానిని ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు కలిశారు. ఈసందర్భంగా వారు సినిమా వేరు, రాజకీయం వేరని పవన్ వ్యాఖలను దాటవేసే ప్రయత్నం చేశారు. సినిమా చాలా సున్నితమైందని దీన్ని కాంట్రవర్సీ చేయద్దని వేడుకున్నారు. వైసీపీ సర్కారు ఇండస్ట్రీ సమస్యలపై సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. మరోవైపు పేర్ని నాని సైతం పవన్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని పేర్కొనడం ఆసక్తిని రేపింది. పవన్ వ్యాఖ్యలను ఇండస్ట్రీనే కాదు సొంత అన్న కూడా సమర్ధించడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తేటతెల్లం చేశారు.
తాజాగా చిరంజీవి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. నేడు రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల ఆవరణలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చిరంజీవి దంపతులతోపాటు మెగా నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. వీరి వెంట వైసీపీ మంత్రులు, నేతలు పెద్దఎత్తున పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. చిరంజీవిని తమవాడిగా వైసీపీ నేతలు ఫోకస్ చేసుకుంటున్న వైనం చర్చనీయాంశమైంది.
చిరంజీవి తొలి నుంచి వైసీపీకి మద్దతు దారుడిగా ఉన్నారు. ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి చిరంజీవి మద్దతు ఇచ్చారు. అలాగే కరోనా విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో ఇండస్ట్రీ సమస్యలను జగన్ దృష్టికెళుతున్నారు. చిరంజీవి పర్యటనలో వైసీపీ మంత్రులు, నేతలు ఉండటంపై జనసైనికులు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది.