ఈనెల 3 నుంచి ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఉత్కంఠ రేపిన తొలి టెస్టు చివరకు డ్రాగా ముగియడంతో రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగమనం చేస్తుండటంతో అతడు ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తాడన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టెస్టు జట్టులోకి కొత్తగా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడటంతో అతడిపై వేటు వేసే అవకాశం లేదు. దీంతో సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానెలలో ఒకరిని తప్పిస్తారా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఒకవేళ వారిద్దరూ జట్టులోనే ఉంటే.. ఓపెనర్లలో ఒకరిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ రాణించలేదు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో వీరిద్దరిలో ఎవరిని తప్పిస్తారో వేచి చూడాలి.
Read Also: అలర్ట్: విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ కలకలం
ఓపెనర్లలో ఒకరిని తప్పిస్తే ఆ స్థానంలో పుజారా లేదా వికెట్ కీపర్ సాహా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే గతంలో సాహాకు ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. అయితే తొలిటెస్టులో సాహా మెడనొప్పితో బాధపడుతుండటంతో సబ్‌స్టిట్యూట్ కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ చేశాడు. మరి రెండో టెస్టుకు సాహా సిద్ధంగా లేకపోతే ఉన్న ఏకైక ఆప్షన్ పుజారాను ఓపెనింగ్‌కు పంపడమే. అయితే కోహ్లీ బదులు ఏ ఆటగాడిని తప్పిస్తారో.. టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈనెల 3వరకు ఆగాల్సిందే. మరోవైపు ఈ టెస్టు గెలవడం టీమిండియాకు తప్పనిసరి. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ముందడుగు వేయాలన్నా… గత ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తమను ఓడించిన కివీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్నా.. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుని పాయింట్ల పట్టికలో మెరుగుపడటం టీమిండియాకు చాలా కీలకం.