మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ఏడాది నెహ్రూ 132వ జయంతి. నెహ్రూకు పిల్లలన్నా.. రోజా పూలన్నా చాలా ఇష్టం. నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలిపేందుకు… నెహ్రూ జయంతి రోజు బాలల దినోత్సవం జరుపుకుంటారు. 1964 మే 27న నెహ్రూ మరణించడంతో ఆయన పుట్టినరోజును చిల్డ్రన్స్ డేగా జరపాలని తీర్మానించగా… అప్పటి నుంచి నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న జరిపేవారు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి నవంబర్ 20ని అంతర్జాతీయ పిల్లల దినోత్సవంగా ప్రకటించింది. అందువల్ల ఇండియా కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే… నెహ్రూ మరణం తర్వాత పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి… భారతీయులు నవంబర్ 14ను జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.
Read Also: 580 ఏళ్ల తర్వాత ఆకాశంలో అరుదైన ఘట్టం
బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు పెద్దలు, టీచర్లు శుభాకాంక్షలు చెబుతారు. వారికి మిఠాయిలు పంపిణీ చేస్తారు. అలాగే… బాలల హక్కులు, వారి విద్యార్హతలపై పిల్లల్లో అవగాహన కల్పిస్తారు. బాలల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ వివరిస్తారు. విద్యార్థులు కూడా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.