గత కొంతకాలంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు జనానికి ఇబ్బందులు కలిగించాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన చలి కాస్త తగ్గుముఖం పట్టింది. రెండు వైపుల నుంచి గాలులు వీస్తున్నా, వాటి ప్రభావం కాస్త తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీచడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ గాడిన పడుతున్నాయని, చలి తీవ్రత తగ్గిందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వర్షాలు కురిసే అవకాశం లేదని సమాచారం. ఉత్తరాది గాలుల ప్రభావం తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో 12 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది.
తెలంగాణలో చలి తీవ్రత తగ్గిందనే చెప్పాలి. గత వారం రోజులుగా జనాన్ని వణికించిన చలి తగ్గి వేడి పెరుగుతోంది. దీంతో కూలీ పనులకు వెళ్లేవారికి, ఉద్యోగస్తులకు ఊరట లభించింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తగ్గుముఖం పట్టింది చలి తీవ్రత. ఆదిలాబాద్ జిల్లా అర్లీటీ లో 13.6 గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. బజార్ హత్నూర్ లో 14 డిగ్రీలు. కొమురం భీం జిల్లా గిన్నె దరి 14.1 గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో గతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యేవి. ఆరు నుంచి ఎనిమిది డిగ్రీలు నమోదయిన సందర్భాలున్నాయి. కానీ తాజాగా ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాకపోవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.