శనివారం నుంచే టీ20 ప్రపంచకప్ పోరు షురూ కానుంది. టోర్నీ మొదలైన రెండో రోజే మహాయుద్ధం జరగనుంది. అదే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్. ఈ పోరు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాయాదుల మధ్య పోరు అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లలో కూడా తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీని పాకిస్థాన్ ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఆ మూడింటిలో ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం గమనార్హం.
Read Also: ఐపీఎల్: కొత్త ఫ్రాంచైజీని కొనే రేసులో బాలీవుడ్ టాప్ కపుల్
అంతేకాదు సదరు మూడు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ స్టైక్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. పాకిస్థాన్‌తో తలపడిన మూడు మ్యాచ్‌లలో కోహ్లీ స్ట్రైక్ రేట్ 130గా ఉంది. ఈ మ్యాచ్‌లలో అతడు 169 పరుగులు చేశాడు. 2012 ప్రపంచకప్‌లో 78 నాటౌట్, 2014 ప్రపంచకప్‌లో 38 నాటౌట్, 2018 ప్రపంచకప్‌లో 55 నాటౌట్‌గా కోహ్లీ స్కోర్లు నమోదయ్యాయి. దీంతో టీమిండియా కెప్టెన్ కోహ్లీ సాధించిన ఘనత చూసి భారత అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. తమ అభిమాన ఆటగాడు ఈ ఆదివారం మరో విలువైన ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నారు.