భారత క్రికెట్‌లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఏడు పరుగులు చేస్తే జోహన్నెస్ బర్గ్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా నిలవనున్నాడు.
Read Also: క్రిస్ గేల్‌కు షాకిచ్చిన వెస్టిండీస్ బోర్డు
రెండో టెస్టుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న జొహనెస్‌బర్గ్ వేదికలో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. అక్కడ మూడు టెస్టులాడిన కోహ్లి ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 310 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జాన్ రైట్ 316 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. మరో ఏడు పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ టాప్‌లోకి రానున్నాడు. 2013-2014 పర్యటనలో ఈ వేదికలో తొలి టెస్టు జరగ్గా.. ఆ మ్యాచులో కోహ్లీ వరుసగా 119, 96 పరుగులు చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో అయినా కోహ్లీ సెంచరీ దాహం తీర్చుకుని కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాలని అతడి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.