తమిళ ‘అసురన్’కు తెలుగు రీమేక్ ‘నారప్ప’. అక్కడ ధనుష్ కథానాయకుడు కాగా, ఇక్కడ వెంకటేశ్ హీరోగా నటించారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి ఎస్ థాను దీన్ని నిర్మించారు. మే 14న థియేటర్లలో రిలీజ్ చేయాలని మొదట భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో తప్పని స్థితిలో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. ‘వి’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలు కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఓటీటీలో విడుదలైతే, ఇప్పుడు సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో ఓటీటీలో వచ్చిన సినిమా ‘నారప్ప’. మరి దీని కథ ఎలా సాగిందో తెలుసుకుందాం…
అనంతపురంలోని ఓ గ్రామంలో భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురుతో జీవితం సాగిస్తుంటాడు నారప్ప (వెంకటేశ్). ఈ గ్రామ పెత్తందారు పండు స్వామి (‘ఆడుకాలమ్’ నరేన్) దృష్టి నారప్ప వ్యవసాయం చేసుకునే మూడు ఎకరాల పొలం మీద పడుతుంది. తన వాళ్ళు కట్టబోయే సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆ మూడు ఎకరాలను ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తాడు. ఊరి ఉమ్మడి బావిలోంచి మోటర్ తో నీళ్ళను తమ పొలాలవైపు పండుస్వామి కొడుకు తోడటంతో గొడవ మొదలవుతుంది. అక్కడ జరిగిన కొట్లాట కారణంగా నారప్ప పెద్ద కొడుకు మునికన్నను (కార్తీక్ రత్నం)ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. పేరుకు పంచాయితీ జరిగినా అక్కడ కూడా నారప్పకు అన్యాయమే జరుగుతుంది. దాంతో తన తండ్రికి జరిగిన అవమానం తట్టుకోలేక మునికన్న పండు స్వామిపై చేయి చేసుకుంటాడు. పగతో రగిలిపోయిన పండుస్వామి, అతని మనుషులు మునికన్నను చంపేసి, తల తెగ్గొడతారు, అన్నయ్య హత్యకు ప్రతీకారంగా పదహారేళ్ళ నారప్ప రెండో కొడుకు చిన్నప్ప (రాకీ) పండు స్వామిని హత్య చేస్తాడు. ఈ గొడవలన్నీ చినికి చినికి గాలివానగా మారతాయి. తన కుటుంబాన్ని, మరీ ముఖ్యంగా చిన్న కొడుకు ప్రాణాలను కాపాడుకోవడానికి నారప్ప ఏం చేశాడు? పెత్తందారులంతా ఒక్కటిగా తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినా, నారప్ప ఎందుకు సహనంతో భరించాడు? అసలు అతని నేపథ్యం ఏమిటీ? అనేది మిగతా కథ.
సినిమా ప్రథమార్ధంలో ధనిక, బీద వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, పాతికేళ్ళ వెనక్కి కథను తీసుకెళ్ళినప్పుడు అగ్ర, నిమ్నకులాల మధ్య ఉన్న ఘర్షణను తెరకెక్కించాడు. దాంతో అట్టడుగు వర్గానికి చెందిన వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో రెండు తరాలను ఉదాహరణగా తీసుకుని చూపించే ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు అగ్రవర్ణాల చేత అవమాన పడిన వారే, ఇవాళ కొంత పొలం సంపాదించుకుని వ్యవసాయం చేద్దామనుకుంటే ఇప్పుడు అదే వర్గానికి చెందిన వారు నయానో, భయోనో భూమిని లాక్కుంటున్నారని చూపించాడు. చిత్రం ఏమంటే… అప్పుడు, ఇప్పుడు ఆవేశకావేశాల కారణంగా అధికంగా నష్టపోయింది, ఊరు వదిలి అనాథలైంది దళిత వర్గాలే. తమ తప్పులేకపోయినా, అకారణంగా దళితులు ఎలా అగ్రవర్ణాల చేతిలో బలిపశువులు అయ్యారన్నదే ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు.
ఇవాళ సమాజంలో పెత్తందారుల స్థానంలోకి కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి, ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని పేదల భూముల మీద డేగ కన్నేసి వాటిని తమ వాణిజ్య సామ్రాజ్య విస్తరణ కోసం కబళిస్తున్నాయి. కాబట్టి ప్రథమార్ధంలోని బీదల భూముల స్వాధీనాన్ని ఈ తరం బాగానే అర్థం చేసుకుంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ లో చూపించిన అట్టడుగు వర్గాల వారిని అతి దారుణంగా హింసించడం అనేది మనం మూడు దశాబ్దాల క్రితం కారంచేడు, చుండూరులో చూశాం. కాబట్టి… ముందు తరం ఆ ఫ్లాష్ బ్యాక్ తో బాగానే కనెక్ట్ అవుతుంది. ఇప్పటి వారికి మాత్రం ‘ఇంత దారుణమైన పరిస్థితులు ఇప్పుడు లేవు కదా… వీటిని ఇప్పుడు చూపించి దర్శక నిర్మాతలు ఏం లబ్ది పొందుదామని అనుకుంటున్నార’నే సందేహం వస్తుంది. అయితే సినిమా పతాక సన్నివేశంలో నారప్పతో చెప్పించిన మాటలు ‘మన దగ్గర భూమి ఉంటే లాక్కుంటారు, ధనం ఉంటే గుంజుకుంటారు, కానీ చదువును మాత్రం ఎవరూ లాక్కోలేరు, అయితే ఆ చదువు ద్వారా పొందే అధికారాన్ని సమాజాన్ని ఏకం చేయడానికి ఉపయోగించాలి తప్పితే… పాత కక్షలు కార్పణ్యాలను గుర్తు చేసి విచ్ఛినం చేయకూడదు’ అనేవి గొప్పగా ఉన్నాయి.
చిత్రం ఏమంటే… ఈ సినిమాలో ఆ పాత కక్షలనే దర్శక నిర్మాతలు గ్లోరిఫై చేస్తూ చూపించారు. ఇవాళ కొంతమంది తెలుగు దర్శకులు, తమిళ దర్శకులు పనికట్టుకుని మరీ సమాజంలోని గత వికృతులను వెండితెరపై ఆవిష్కరించి, సామాజిక అంతరాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని భావించి మన నిర్మాతలు అలాంటి సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘దొరసాని, పలాస, ఉప్పెన’ వంటివి ఆ కోవకు చెందిన సినిమాలే. ‘నారప్ప’ కూడా అలాంటి ప్రయత్నమే. గాయపడిన దళిత వర్గాల హృదయావిష్కరణ నెపంతో ఇప్పుడు కొత్తగా సమాజంలోని సామరస్య వాతావరణాన్ని పాడు చేయాల్సిన అవసరం లేదని మనవాళ్ళు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఇది వెంకటేశ్ వన్ మ్యాన్ షో. కథను తన భుజానకెత్తుకుని ముందుకు తీసుకెళ్ళాడు. ముగ్గురు పిల్లల తండ్రిగా ఎంతో సహజంగా ఎమోషన్స్ ను పండించిన వెంకటేశ్ ను, ఫ్లాష్ బ్యాక్ లో అమ్ము అభిరామి పక్కన చూడటం కాస్తంత ఇబ్బందిగానే ఉంది. ప్రియమణి సుందరమ్మ పాత్రలో ఒదిగిపోయింది. అయితే నారప్ప నేపథ్యం తెలిసి కూడా అతని చేతకానితనాన్ని ఆమె అప్పుడప్పుడూ దెప్పిపొడవడం సరికాదనిపిస్తుంది. ఇక యువ నటుడు కార్తీక్ రత్నం మొదటి నుండి ఏ పాత్ర చేసినా అందులో ఒద్దికగా ఇమిడిపోతున్నాడు. ఇందులోనూ అదే చేశాడు. రాజీవ్ కనకాల, నాజర్, శ్రీతేజ్, రావు రమేశ్, బ్రహ్మాజీ, ఝాన్సీ, ‘అరుంధతి’ అరవింద్, రాకీ చక్కగా నటించారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా వరకూ చేసిన పని ఏదైనా ఉంది అంటే అది నటీనటుల నుండి తనకు కావాల్సిన నటనను రాబట్టుకోవడమే. ఎందుకంటే… తమిళ సినిమా ‘అసురన్’లోని సన్నివేశాలను అలానే దించేశారు. సంభాషణలను యథాతథంగా తర్జుమా చేశారు. అక్కడ జీవీ ప్రకాశ్ ఇచ్చిన మెయిన్ బీజీఎం నే ఇక్కడా వాడేశారు. దాంతో ప్రధాన తారాగణం లేని కొన్ని సన్నివేశాలను చూస్తే మనం డబ్బింగ్ సినిమా చూస్తున్నామా అనే భావన కూడా కలుగుతుంది. మణిశర్మ స్వరాలు, దానికి గీత రచయితలు అందించిన సాహిత్యం వీక్షకులను పెద్దంత ఉత్తేజభరితం చేయలేదు.
17 సంవత్సరాల క్రితం వెంకటేశ్ హీరోగా ‘కాక కాక’ను ‘ఘర్షణ’గా తెలుగులో రీమేక్ చేసిన కలైపులి ఎస్ ధాను, ఇప్పుడు ‘అసురన్’ను ‘నారప్ప’ పేరుతో సురేశ్ బాబుతో కలిసి రీమేక్ చేయడం ఓ విశేషం. అలానే ఎనిమిదేళ్ళ క్రితం వెంకటేశ్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రం చేసిన శ్రీకాంత్ అడ్డాల రెండోసారి అతన్ని ‘నారప్ప’గా వెండితెర మీద ఆవిష్కరించాడు. ఈ తరహా కథను శ్రీకాంత్ అడ్డాల ఎలా హ్యాండిల్ చేస్తాడో అని అనుమానించిన వారికి, ధనుష్ పోషించిన పాత్రను వెంకటేశ్ ఎలా రీ – ప్రెజెంట్ చేస్తాడో అని సందేహించిన వారికి… వీరిద్దరూ తమ అనుభవంతో చక్కని సమాధానమే చెప్పారు. యాక్షన్, ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామాను వీకెండ్ లో చూసేయొచ్చు.
ప్లస్ పాయింట్స్
వెంకటేశ్ నటన
ఎంచుకున్న కథ
ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
తేలిపోయిన పతాక సన్నివేశం
నిదానంగా సాగే ద్వితీయార్ధం
రేటింగ్ : 2.75 / 5
ట్యాగ్ లైన్ : వెంకటేశ్ వన్ మ్యాన్ షో!