దక్షిణాసియాలో చైనా రోజురోజుకు తన దూకుడును పెంచుతున్నది. సైనిక బలగాన్ని పెంచుకుంటూ దక్షిణ సముద్రంతో పాటుగా ఇతర దేశాలపై కూడా తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే పాక్, శ్రీలంకతో పాటుగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైకూడా చైనా కన్నుపడింది. అటు హాంకాంగ్, వియాత్నం కూడా తమవే అని చెప్తున్నది. రోజు రోజుకు చైనా తన బలాన్ని పెంచుకుంటుండటంతో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఆసియాలోని ఇండియా, జపాన్, అస్ట్రేలియాతో కలిసి ఇప్పటికే క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసిన అమెరికా, ఇప్పుడు బ్రిటన్, ఆస్ట్రేలియాతో కలిసి అకూస్ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో భాగంగా పసిఫిక్ జలాల్లో తమ బలాన్ని పెంచుకోబోతున్నాయి. చైనాకు ధీటుగా 12 అణుజలాంతర్గాములను ఏర్పాటు చేసుకోబోతున్నాయి. గతంలో అమెరికా ఈ అణుజలాంతర్గామి టెక్నాలజీని యూకేతో పంచుకున్నది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా పంచుకోతున్నది. అణుజలాంతర్గాములను ఆస్ట్రేలియా తీరంలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నాయి. చైనా ప్రాభల్యాన్ని తగ్గించేందుకు అమెరికా ఈ విధమైన నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, బ్రిటన్, ఇండియా, చైనా, ఫ్రాన్స్ దేశాలు మాత్రమే అణుజలాంతర్గాముల టెక్నాలజీ కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీని ఆస్ట్రేలియాతో పంచుకోవడం విశేషం. చైనాకు వ్యతిరేకంగా ఈ కూటమిలో నిర్ణయాలు లేవని యూకే చెబుతున్నది. ఇప్పటికే చైనా, ఆస్ట్రేలియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆస్ట్రేలియా అకూస్ కూటమిలో భాగం కావడంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ జలాల్లోకి ఆస్ట్రేలియా జలాంతర్గాములను నిషేదిస్తున్నట్టు ప్రకటించింది.