తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు ఇంగ్లండ్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల సంస్థ టీటీడీకి సర్టిఫికెట్ అందజేసింది. ఈ సర్టిఫికెట్‌ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల సంస్థ ప్రతినిధులు స్వయంగా అందజేశారు.
Read Also: తిరుపతి కౌన్సిల్ సమావేశంతో ఒరిగేదేంటి?
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా తిరుమలలో ఉచితంగా టీటీడీ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60వేల నుంచి 70 వేల మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కల్యాణ కట్టలో రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది భక్తులు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో రోజుకు 3.5 లక్షల లడ్డూలను తయారుచేసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తున్నామని చెప్పారు.