తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలయింది. పిల్ దాఖలు చేశాడు లా విద్యార్థి బొమ్మనగరి శ్రీకర్.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఏ చట్ట ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలో చెప్పాలంది హైకోర్టు. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు అందేలా చూడాలని పిటిషనర్ కోరారు.
ధాన్యం దళారులు దోచుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తూ చనిపోయిన 700 మంది రైతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించి ప్రభుత్వం తెలంగాణ కావొచ్చంది హైకోర్టు. పత్రికల కథనం ప్రకారం ధర్నాలో చనిపోయిన ప్రతి రైతు కుటుంబాలకు 3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హైకోర్టు పేర్కొంది.
జనవరి చివరి వరకు ధాన్యం కొనుగోలు చేస్తూనే ఉంటామని ఏజీ కోర్టుకి తెలిపారు. ఏజీ వాదనను పరిగణనలోకి తీసుకుని ధాన్యం కొనుగోలుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. జనవరి మూడవ వారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.