హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచార పోరు నడుస్తోంది. ఉప ఎన్నికకు సమయం ముంచుకువస్తుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ తమ అధినేత కేసీఆర్‌తో సభలు నిర్వహించేలా ప్రణాళికలు రచించింది. ఈనెల 27న హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట గ్రామంలో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు వీలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే హుజురాబాద్‌కు పక్కనే పెంచికల్ పేట ఉంటుంది.
Read Also: ఉప ఎన్నికలు జరిగే జిల్లా అంతటా కోడ్ అమలు: కేంద్ర ఎన్నికల సంఘం
అయితే గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త గైడ్‌లైన్స్ రూపొందించింది. ఉపఎన్నికలు జరుగుతున్న జిల్లాలో లేదా నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో కూడా ఉప ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను నిర్వహించవద్దని సీఈసీ రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. దీంతో ఈనెల 27న పెంచికల్ పేటలో కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించడంపై టీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడిందని తెలుస్తోంది.