తుపాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడుతోంది. తుపాన్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, దాన్ని ఎదుర్కొనేందుకు తిరుపతిలో యంత్రంగం సిద్ధంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతిలో తుపాన్ ప్రభావంతో దెబ్బ తిన్న ప్రాంతాలలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. జోరు వాన, గాలిని సైతం లెక్కచేయకుండా కలియదిరిగారు. లక్ష్మీపురం కూడలి వద్ద మోకాలి లోతైన నీటిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. అశోక్ నగర్ వద్ద చెట్టు విరిగి రాకపోకలకు ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని రాకపోకలు పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టారు.
టీటీడీ క్వార్టర్స్ సమీపంలో గాలి వానకు విరిగిన చెట్ల కొమ్మలను స్వయంగా లాగారు. ఇష్కాన్ రోడ్డులో గాలి వానకు ఒరిగి పోయిన చెట్లను తొలగించే క్రమంలో స్వయంగా మిషన్ చేతబూని కట్ చేశారు. ఎక్కడికక్కడ నగరంలో విరిగిన చెట్లు, విద్యుత్ పోల్స్ ను జేసీబీల సహాయంతో తొలగించే ఏర్పాట్లను చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలతో స్థానిక వెస్ట్ చర్చ్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద నీటిలో వాహనం చిక్కుకుని బెంగుళూరుకు చెందిన ఓ నవ వధువు మృతి చెందింది. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని అండర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు.
తిరుపతి నగరంలో మిగిలిన లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని నగర పాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ పీఎస్ గిరీషాతో భూమన సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ వర్షానికి తోడుగా ఈదురు గాలి కూడా తోడవడంతో నగరంలో సుమారు వంద, వందా పాతిక పైగా చెట్టు నెలకొరిగాయని, కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా విరిగిపడ్డాయని తెలిపారు.
అయితే నగర పాలక సంస్థ అధికారులు, పోలీస్ అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉన్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు. విరిగిన చెట్లను, ట్రాఫిక్ సిగ్నల్స్ ను అప్పటికప్పుడే తొలగించారని, తిరిగి ట్రాఫిక్ పునరుద్ధరించారని తెలిపారు. వెస్ట్ చర్చ్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఇటీవల నవ వధువు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరిగిందని, దీంతో ఇంత పెద్ద వర్షం పడినా…రెండు సెంటీమీటర్లు కూడా వరద నీరు నిలవడం లేదని భూమన వివరించారు.