నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో భారత జవాన్లు మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో సామాన్య పౌరులను చూసి మిలిటెంట్లుగా భావించి వారిపై జవానులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. ఓటింగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బొగ్గుగనిలో విధులు ముగించుకొని తిరిగి వస్తున్న కార్మికులను చూసి జవాన్లు ఉగ్రవాదులుగా భావించారు.
Read: అంబర్ పేటలో దారుణం: భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య…
ఈ ఘటన తరువాత ప్రజలు ఆగ్రహంతో భారత జవానుల వాహనాలను తగలబెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనిపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయ్‌ప్యూ రియో స్పందించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామని, దీనిపై సిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓటింగ్ ప్రాంతంలో భారీగా పోలీసులు, భద్రతా బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.