సెప్టెంబర్ 1న జరగబోయే కేఆర్‌ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అనుసరించాల్సిన వ్యూహం పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకురాబోయే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో… సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సిఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్ సీ మురళీధర్ తదిరతులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటివాటాకోసం కేఆర్ఎంబీ, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని పునురుద్ఘాటించారు. సాధికారిక సమాచారంతో కెఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్.