కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండు కాంపోనెంట్లుగా (1.14 మరియు 1.15) గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచారు. అవి రెండూ ఒకే కాంపోనెంట్ గా పొందుపర్చాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే KRMB కి లేఖ రాసింది. గెజిట్ నోటిఫికేషన్ లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండవ కాంపోనెంట్ ను 25 టిఎంసీల నుండి 40 టిఎంసిల వరకు పెంచినదిగా చూపించారు. అది తప్పు అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నాటి ఆంధ్ర ప్రదేశ్ కల్వకుర్తి ఆయకట్టును 2.5 లక్షల నుండి 3.65 లక్షల ఎకరాలకు పెంచింది కాని నీటి కేటాయింపులు ఆ మేరకు సరిపోయినంతగా పెంచలేదు.
తెలంగాణ ప్రభుత్వం ఆ పెంచిన ఆయకట్టుకు సరిపొయే నీటి కేటాయింపులు చేసింది తప్ప కొత్తగా ఆయకట్టును పెంచలేదు. కొత్త సోర్స్ నుండి నీటిని తిసుకొవడం లేదు అని తెలియజేయడం జరిగింది. ఆయకట్టు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలను కూడా పేర్కొనడం జరిగింది. ఇక కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం శ్రీశైలం రిజర్వాయిర్ నుండి +800 అడుగుల వద్ద నీటిని తీసుకునే విధంగా 2006 లోనే బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట నివేదించిన DPR లోనే ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులైన GNSS, Veligonda, HNSS, TGP ప్రాజెక్టు రిపోర్టులను కూడా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట నివేదిస్తూ నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు FRL +885 అడుగుల వద్ద / FRL కు సమీప మట్టం వద్ద నీటిని తీసుకునేవిధంగా డిజైన్ చేసినట్టు తెలియజేశారు.
కల్వకుర్తి క్రిష్ణా నది బేసిన్లోని ప్రాజెక్టు కాబట్టే 800 అడుగుల వద్ద, బేసిన్ ఆవలివి కాబట్టే ఆంధ్ర ప్రాజెక్టులను పూర్తి రిజర్వాయర్ మట్టం 885 అడుగుల వద్ద తీసుకునే విధంగా డిజైన్ చేశారు అని తెలంగాణ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కొనసాగుతున్న KWDT-II వద్ద ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 75 శాతం విశ్వసనీయత గల నికర జలాలను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కు కేటాయించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం GNSS, Veligonda, HNSS తదితర ప్రాజెక్టులకు మిగులు జలాల కేటాయింపు మాత్రమే కొరింది. 75 శాతం విశ్వసనీయత గల నికర జలాలు కేటాయించాలని కోరలేదు అని తెలంగాణ స్పష్టపరిచింది. ఈ కారణాల రీత్యా తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సవరించడానికి చర్యలు తీసుకోవాలని, గజిట్ నోటిఫికేషన్ నుండి కల్వకుర్తి రెండవ భాగాన్ని 1.15 ను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని KRMBని కోరడమైనది.. అని లేఖలో పేర్కొన్నారు.