సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మీటింగ్ జరగనుంది. ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్… నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయిన యాసంగి వడ్ల కొనుగోళ్లపైనే కేబినెట్ లో ప్రధాన చర్చ జరగనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచే యాసంగి వడ్లు మార్కెట్లకు రావడం మొదలైంది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పినందున తాము కూడా యాసంగి వడ్లు కొనబోమని గతంలోనే ప్రకటించింది కేసీఆర్ సర్కార్. అయితే రాష్ట్రంలో సమస్య తీవ్రం కావడంతో… దానిపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
Read Also: Pawan Kalyan: జనసేనాని రైతు భరోసా యాత్ర.. కౌలు రైతు కుటుంబాలకు పరామర్శ..
యాసంగి వడ్లు కొనాల్సిందేనంటూ… నిన్న ఢిల్లీలో ఆందోళన చేసింది టీఆర్ఎస్. కేంద్రానికి 24గంటల టైమ్ ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈ మధ్యాహ్నంతో ఆ గడువు ముగియనుంది. దీంతో కేసీఆర్ ఏం చేస్తారన్న ఆసక్తి ఏర్పడింది. కేంద్రం నుంచి కొత్తగా స్పందన వచ్చే అవకాశం కనిపించడంలేదు. యాసంగిలో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనాల్సి వస్తుందని అంచనా. రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేసి రా రైస్ గా మారిస్తే ఎంత నష్టం వస్తుంది. దాన్ని ఎలా భరించాలి. రైతుల దగ్గర వడ్లు కొని మిల్లర్లకు అమ్మడం ఇలాంటి అంశాలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. కేంద్రం వడ్లు కొనకపోయినా… తెలంగాణ పేదరికంలో ఏమీ లేదని నిన్నటి సభలో కేసీఆర్ చెప్పారు. దీనిబట్టి చూస్తే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
వడ్ల కొనుగోళ్లపై రాజకీయ, ప్రభుత్వ పోరాటాలకు తోడుగా న్యాయపరంగానూ పోరాడాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. పంజాబ్ తరహాలో వడ్లు కొనాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఒకే కొనుగోళ్ల విధానంపై జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వడ్ల కొనుగోళ్లతో పాటు ఉద్యోగాల భర్తీ, రెండో దశ ఆర్థిక శాఖ అనుమతుల జారీ, నోటిఫికేషన్లకు అనుమతులు లాంటి అంశాలు కూడా కేబినెట్ మీటింగ్‌లో చర్చకు రానున్నాయి. అలాగే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల ఎత్తివేతపైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది.