కృష్ణానదీ జలాలపై ఎపి తెలంగాణ మధ్య ముదిరిన వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు లేవు.మేమంటే మేమే సరైన విధానంతో వున్నామని ఉభయ రాష్ట్రాలూ గట్టిగా వాదిస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత వ్యవస్థలకు ఫిర్యాదులు చేస్తున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాగూ ఇలాటి వివాదాలను వెంటనే పరిష్కరించేతొందరలోలేదుగనక నీళ్లునిప్పులై మండటం అనివార్యం. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అనే ఆరోపణలుచేసేవారే మళ్లీ అవతలివారిని గట్టిగా ఖండిరచలేదని తప్పుపడుతున్నారు. మొత్తంపైన ఈవివాదంలో రాజకీయాలు వున్నా నీటికి సంబం ధించినపూర్తి భిన్నాభిప్రాయాలు అవాస్తవం కాదు. ఎపి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ సామర్థ్యం పెంచడంకోసం ఉద్దేశించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(ఆర్‌ఎల్‌ఐఎస్) అక్రమమని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ఆరోపించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో చుక్కనీరు మిగలకుండాతోడేసుకుంటారని తెలంగాణ మంత్రులు ధ్వజమెత్తారు. అయితే వరద నీటిలో తమకు కేటాయించిన వాటానే శ్రీశైలం నుంచి వేగంగా తీసుకోవడానికి ఆర్‌ఎల్‌ఐసి తప్ప అదనంగా తీసుకోబోమని ఎపి వాదన, ఇప్పటికే తెలంగాణ అనుమతి లేకుండా కట్టిన ప్రాజెక్టుల వల్ల జల విద్యుత్ ఉత్పత్తి వల్ల శ్రీశైలం నీటిమట్టం వేగంగా పడిపోతున్నదనీఎపి ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు.పాలమూరు రంగారెడ్డి ,డిరడి ఎత్తిపోతలవంటిచాలా వాటికి అనుమతిలేదని ఎపిఅంటుంటే అవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనవేనని తెలంగాణవాదనగా వుంది.తర్వాత కెసిఆర్ చేసిన రీడిజైనింగ్ వాటిని పూర్తిగామార్చేసిందని ఎపి అంటున్నది. ఈ వాదోపవాదాల కన్నా కృష్ణా రివర్ వాటర్ మేనేజిమెంట్ బోర్డు(కెఆర్‌ఎంబి) ముందు గతంలో ఇరు రాష్ట్రాలు కూడా పూర్తి నిర్మాణనివేదికలు( డిటైల్డ్ ప్రాజెక్టురిపోర్టు) ఇచ్చినతర్వాతే ముందుకు పోతామని అంగీకరించారు.
read also : విశాఖ జిల్లాలో అపశృతి..ఫ్లైఓవర్ కూలి ఇద్దరు మృతి
జులై 9న కెఆర్‌ఎంబి సమావేశం ఏర్పటైంది కూడా.అయితే ఈ సమావేశం 20 తర్వాత జరపాలని తెలంగాణ చెప్పింది. తమ ఆరోపణలు పట్టించుకోకుండా కేవలం ఎపి కోణంలోనే ఎజెండా తయారైందని ఇప్పుడు ఆరోపిస్తున్నది. ఇక ఎపి ప్రభుత్వం తమ నిపుణులు పోతిరెడ్డిపాడు సందర్శనకు సహకరించలేదని గతంలో కెఆర్‌ఎంబి ఫిర్యాదు చేసింది. కరోనా కారణంగా అధికారిని కేటాయించలేకపోయాము గాని ఇప్పుడు సహకరిస్తామని ఎపి మంత్రులు చెప్పారు.అయితే తెలంగాణ అనుమతి లేకుండా నిర్మిస్తున్న అనేక ప్రాజెక్టులను ముందు చూడకుండా కేవలం సీమ పథకంపైనే ఎందుకు కేంద్రీకరిస్తున్నారని వారిప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఏతావాతా ఉభయ రాష్ట్రాలూ కెఆర్‌ఎంబి నిర్ణయాధికారాన్ని ప్రశ్నిస్తూ దానిద్వారా పరిష్కారం వస్తుందనే ఆశలేకుండా చేశాయి.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రస్తుతం నిలిపివేయబడిరది గనక ఇంకా బచావత్ అవార్డు ప్రకారమే అంటే ఎపికి 66శాతం తెలంగాణకు 34 శాతం నీటి పంపిణీ జరగాల్సివుంటుంది. కెసిఆర్ అద్యక్షతన జరిగిన ఉన్నత స్థాయిసమావేశం ఒక్కసారిగా దీన్ని తోసిపుచ్చుతూ 50-50 శాతం చొప్పున పంపిణీ కావాలని తీర్మానం చేసింది.
ఇది ఇటీవలి వరకూ ఇరురాష్ట్రాల మధ్య వున్న అవగాహనకు పూర్తి భిన్నం. ఈ విధంగా ఎవరికి వారు తమకు ఇంత నీరు రావాలని ఏకపక్షంగా తీర్మానం చేస్తే రాజ్యాంగం ఒప్పుకుంటుందా? రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారమవుతాయా? ఇప్పటివరకూచట్టబద్దంగా వచ్చే నీటికోసం పోరాడుతున్నామని చెప్పిన కెసిఆర్ ఎందుకు ఇంతగా మార్చివేశారు? ఈ తీర్మానం పూర్తి అసంబద్దమంటూనే తమకు ఎత్తిపోతల తప్ప మరో మార్గం లేదని జగన్ చెబుతున్నారు. వాస్తవానికి కెసిఆర్ వాదనసారాంశం కూడా ఎత్తిపోతల పథకాలు ప్రధానమై నందునే ఎక్కువ నీరు అవసరమనే. అయితే ఇవి రాజకీయంగా తిట్టిపోసుకోవడం వల్ల గాని, రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెంచుకోవడం వల్ల గాని జరిగేవి కావు.రాజ్యాంగ పరిధిలో చట్ట బద్దంగా పట్టువిడుపులతో పరిష్కరించుకోవలసినవి మాత్రమే. జరుగుతున్నది అందుకు పూర్తి భిన్నం. ఈ మధ్యలోనే జలవిద్యుత్ ఉత్పత్తి సమస్య కూడా తీవ్రమైంది. శ్రీశైలం పులిచింతల వద్ద నీళ్లు లేకున్నా జలవిద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని వదలడం వల్ల డెల్టా ప్రాంతానికి నష్టం జరుగుతుందని ఆ నీరు సముద్రం పాలవుతున్నదని ఎపి చెబుతున్నది.
నీటి లభ్యత అనే అంశాన్ని పక్కన పెట్టి శ్రీశైలం కట్టిందే విద్యుత్ కోసమనీ, బచావత్ అవార్డుకూ దీనికి సంబంధమే లేదని తెలంగాణ వాదిస్తున్నది. ఈ విషయమై తెలంగాణ హైకోర్టు ముందు కూడా విచారణ మొదలైంది, ఈ విచారణ సమయంలో తెలంగాణ అడ్వకేట్ జనరల్ ధర్మాసనంలో న్యాయమూర్తులను తప్పుకోవాలని కోరడం కూడా వివాదాస్పదమైంది. ఎపిముఖ్యమంత్రి ప్రధాని మోడీకి కేంద్ర మంత్రులకూ లేఖలు రాయగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏకంగా ఢల్లీికే వెళ్లి మాట్లాడాలని భావిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. మొత్తానికి ఇవన్నీ ఒక్కసారిగా వాతావరణం మార్చేశాయి. ఈ మొత్తం వివాదం పాలక పక్షాలు మాట్లాడటమే గాని ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవడం అఖిలపక్షం వంటివి లేవు. మరోవంక బిజెపి కాంగ్రెస్‌లు రెండుచోట్ల రెండు రకాలుగా మాట్లాడుతున్నాయి.
కొత్తగా పిసిసి అద్యక్షుడైన రేవంత్ రెడ్డి మరింత గజిబిజిగా ఇది మ్యాచ్‌ఫిక్సింగ్ అంటూ విరుద్ధమైన వాదనలు చేస్తూనే మరోవంక కెసిఆర్ ఆమరణ దీక్ష చేయాలని సలహా ఇస్తున్నారు. ఢల్లీినుంచి ఎలాటి స్పందన లేని వాస్తవం కనిపిస్తుంటే టిడిపి అద్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢల్లీికి అఖిలపక్ష ప్రతినిధివర్గాన్ని తీసుకుపోవాలని చెబుతున్నారు.కొన్నిసార్లునీటి కేటాయింపుల గురించి మరికొన్ని సార్లు పర్యావరణ అనుమతుల గురించి అభ్యంతరాలు చెబుతుండడం కూడా భిన్న సంకేతాలు ఇస్తున్నది. జులై 7 వ తేదీన నిపుణుల కమిటీ ఆర్‌ఎల్‌ఐఎస్‌గురించి పరిశీలన జరుపు తుందని చెబుతున్నారు గనక చూడాల్సి వుంటుంది. 9వ తేదీన కెఆర్‌ఎంబి సమావేశం ఎలా పరిణమిస్తుందో కూడాచెప్పలేని పరిస్తితి. ప్రజాస్వామిక చర్చలు రాజ్యాంగ సూత్రాల మేరకు పరిష్కరిం చుకోవాలంటూనే ఇలా రాజకీయ రభసగా మార్చుకోవడం ఇరు రాష్ట్రాలకూ చేసే మేలు వుండదు.