బీజేపీ నిర్వహించే ప్రజాగ్రహ సభ చరిత్రలో బూటకంగా నిలిచిపోతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీజేపీకి ఏపీలో ఉన్న బీజేపీకి చాలా తేడా ఉందని, రాష్ట్రంలో ఉన్న బీజేపీ జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.
పశ్చిమబెంగాల్ లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర హోంమంత్రి వెళతారని, ఏపీలో ఏమి జరిగినా కేంద్రం మాట్లాడటం లేదని ఆయన అన్నారు. కేంద్రం టెలిస్కోప్ లో రాష్ట్ర రాజకీయలను చూస్తుందని కేంద్ర మంత్రి ఒకరు అన్నారని, కానీ ఇక్కడ సినిమా స్కోపీలోనే అన్యాయం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.
విజయడవాడలో బీజేపీ నిర్వహిస్తున్నది ప్రజాగ్రహ సభ కాదు జగన్ అను గ్రహ సభ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. చైనాలో ఉన్న కోవిడ్ కు వ్యాక్సిన్ కనిపెట్టారు. ఏపీలోని జగన్ అనే వైరస్ కు కేంద్రం వ్యాక్సిన్ వేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హిందూ దేవాలయలకు ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు మీద దాడి జరిగినా బీజేపీ నాయకులు ఒక్క మాట కూడా అనలేదని, బాబాయ్ హత్య మీద ఇవాళ్టికి విచారణ లేదని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, హత్యలు పోలీసులు అరాచకాలు పై విచారణ చేయించండి ఆయన డిమాండ్ చేశారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ఏపీ బీజేపీ ప్రభుత్వం కు అనుకూలంగా పనిచేస్తోందని, కేంద్ర నిధులతో వచ్చిన పథకాలకు కూడా జగన్ పేరు పెట్టుకున్నా ఏపీ బీజేపీ నాయకులకు నోరు మెదపడం లేదన్నారు.