కలకలం సృష్టించిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పులో తుఫాన్‌లా ముగిసింది… అసంతృప్తితో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బుచ్చయ్య చౌదరి గత నెలలో సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. దీంతో బుచ్చయ్య చౌదరితో తెలుగుదేశం నాయకత్వం సంప్రదింపులు జరిపింది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాతో భేటీ అయ్యారు బుచ్చయ్య చౌదరి.. దీంతో.. బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారానికి పులిస్టాప్ పడిపోయింది.. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన బుచ్చయ్య చౌదరి.. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే.. తాజాగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన అంశాలను వెల్లడించారు.. పార్టీలో లోటుపాట్లను చంద్రబాబుకు రాతపూర్వకంగా ఇచ్చానన్న ఆయన.. ఇతర ప్రతిపక్షాలను కూడా కలుపుకోవాలని సూచించానని తెలిపారు.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని.. అందరితో కలిసి ముందుకు వెళ్లాలని సూచించినట్టు చెప్పుకొచ్చారు.
ఇక, వైఎస్ జగన్ ప్రభుత్వం పెన్షన్ లబ్దిదార్లకు చుక్కలు చూపిస్తోందన్నారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాలు పింఛన్లు తొలగిస్తున్నారని.. ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే కేంద్రం పోలవరం అంచనాలు 55వేల కోట్లకు కేంద్రం అంగీకరించ లేదన్నారు. పోలవరం నిర్వాసితుల ఇళ్లకు 25 రకాల సౌకర్యాలు కల్పిస్తామనీ రెండు సౌకర్యాలు కూడా ఇవ్వలేదని ఆరోపించిన ఆయన.. రెండేళ్లలో 9 వేల కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ ఛార్జీలు ప్రజల నుంచి వసూలు చేశారని విమర్శించారు. మరోవైపు. ప్రతిపక్షాలపై తప్పుడు కేసుల విధానం మానకపోతే డీజీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. కాగా, పార్టీ లోటు పాట్లపై స్పష్టంగా అధినేతకు చెప్పానని.. పార్టీ ఎలా ఫైట్ చెయ్యాలి అనేది అధినేతకు వివరించానని.. కార్యకర్తలు మనోభావాలను గుర్తిచాలలని.. పార్టీలో మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉందని.. పార్టీలోకి వచ్చే వాళ్ళు, పోయేవాళ్ళు ఎక్కువ అయ్యారన్నారు. సామాజికంగా పార్టీ బలోపేతం కావాల్సి ఉందని తదితర విషయాలను చంద్రబాబుతో జరిగిన భేటీలో బుచ్చయ్య చౌదరి.. ఆయన దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.