ఏపీలో భోగి పండుగ రోజు కూడా టీడీపీ నేతలు వారి నిరసనలు తెలపడానికి విరామం ఇవ్వడం లేదు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, ప్రజలకు నష్టకలిగించే జీవోలు ప్రవేశపెడుతోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ రోజు భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ భోగి మంటలు వేసి ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. అయితే కృష్ణాజిల్లాలో గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు భోగి మంటలు వేశారు. అంతేకాకుండా ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. దీనితో పాటు విజయవాడలో టీడీపీ కార్యాలయం వద్ద వేసి భోగి మంటల కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు చెత్త పన్ను ప్లకార్డులను భోగి మంటల్లో వేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు.