తెలంగాణ కాంగ్రెస్ వినూత్నంగా నిరసన తెలిపింది. వరి ధాన్యం విషయంలో ఢిల్లీతో తేల్చుకునే వస్తాం అని చెప్పిన మంత్రులు ఖాళీ చేతులతో రావడంతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీకి వెళ్ళిన మంత్రులు రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసింది.ఢిల్లీ వెళ్ళి వచ్చిన మంత్రులకు చీరె, సారె పంపారు కాంగ్రెస్ మహిళా నేతలు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాక్షస క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి. పార్లమెంట్ సమావేశాల్లో పోరాడలేక టీ.ఆర్.ఎస్ ఎంపీలు చేతులెత్తేశారని, పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు గా టీ.ఆర్.ఎస్ వ్యవహరిస్తోందన్నారు. 258 మంది రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొట్టన పెట్టుకున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు చేతకాని వ్యక్తులుగా ఢిల్లీ నుంచి ఉత్త చేతులతో తిరిగొచ్చారు. చేతకాని మంత్రులు రాజీనామా చేయాలి.. చీర , గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోవాలని ఆమె అన్నారు.