కరోనా కారణంగా తల్లిదండ్రుల ఆదాయం తగ్గడంతో అప్పటివరకూ ప్రైవేట్ స్కూళ్ళలో వేలకు వేలు ఫీజులు కట్టి చదివించిన వారు సర్కారీ బడుల బాట పట్టారు. చదువు ఎలా వున్నా ఫర్వాలేదు.. ఆర్థిక భారం మోయలేమంటూ వారంతా ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయించారు. అయితే పరిస్థితులు మారాయి. భుత్వ పాఠశాలల నుండి తిరిగి ప్రైవేట్ స్కూల్స్ కి విద్యార్థుల వలసలు పెరిగాయంటున్నారు అధికారులు.
కరోన కారణంగా లాక్ డౌన్, ఫీజులు కట్టలేక తమ పిల్లలను ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు తల్లి దండ్రులు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు నో అడ్మిషన్స్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీల రికమండేషన్లు కూడా తెచ్చుకుని తమ పిల్లల్ని చేర్పించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పుడు సాధారణ పరిస్థితి లు నెలకొనడం, ప్రభుత్వ స్కూల్స్ తెలుగు మీడియం కావడం తో పునరాలోచనలో పడ్డారు తల్లిదండ్రులు.
దీనికితోడు ఆదాయం కోల్పోవడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తమ వైఖరి మార్చుకున్నాయి. స్కూల్ మారిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాత ఫీజులు కట్టకున్న ఫర్వాలేదు. ఇప్పటి నుండి ఫీజులు కడితే చాలని పేరెంట్స్ ను ఒప్పిస్తున్నాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. దీంతో వలసలు పెరిగాయి. ప్రభుత్వ స్కూల్స్ నుండి తిరిగి ప్రైవేట్ కు పంపిస్తున్నారు తల్లిదండ్రులు.
మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ కి వలసలు మొదలయ్యాయని ఒప్పుకుంటున్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే వెళ్లిపోతున్నారని అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ప్రైవేట్ స్కూళ్ళ కంటే తమ దగ్గర నిపుణులైన ఉపాధ్యాయులు, సువిశాలమయిన ఆటస్థలాలు వున్నాయని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం గతంలోలాగే ప్రైవేట్ పాఠశాలలకు పంపడానికే మొగ్గుచూపుతున్నారు.