(ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమి)
తెలుగునాటనే కాదు యావద్భారతంలోనూ శ్రీకృష్ణ పాత్రలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు ఖ్యాతి గాంచారు. ఆయన శ్రీకృష్ణ పాత్ర ధరించిన అనేక చిత్రాలు హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా భాషల్లోకి అనువాదమై అలరించాయి. ఉత్తరాదిన శ్రీకృష్ణ పాత్రకు అంతకు ముందు పెట్టింది పేరుగా నిలచిన షాహూ మోడక్ ను సైతం యన్టీఆర్ అభినయం మరిపించింది. యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీకృష్ణుని గెటప్ లో కనిపించిన చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’. 1954లో ఎఫ్. గఫూర్ రూపొందించిన ఈ సినిమాలో “మదిలో హాయి కలలే వేయి విరిసే నీరేయి గోపాలబాల…” అనే పాటలో కాసేపు యన్టీఆర్ శ్రీకృష్ణుని గెటప్ లో కనిపిస్తారు. ఆ తరువాత 1956లో ప్రముఖ గాయకులు ఘంటసాల నిర్మించిన ‘సొంతవూరు’లో ఓ సీన్ లో కృష్ణుని గెటప్ లో కనిపిస్తే, జనం గోల చేస్తారు. దాంతో యన్టీఆర్ కృష్ణునిగా నటిస్తే జనం తెరలు చించారనే ఓ ప్రచారం ఉంది. కానీ, అది సినిమాలోని సన్నివేశం తప్ప మరేమీ కాదు. ఇక 1957లో ‘మాయాబజార్’ చిత్రంతో యన్టీఆర్ ను కేవీ రెడ్డి అపర శ్రీకృష్ణునిగా తీర్చిదిద్దారు. ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కావడం వల్ల కృష్ణుడంటే యన్టీఆరే అనే పేరు లభించింది. ఆ పై కేవీ రెడ్డి దర్శకత్వంలోనే ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (1963), ‘శ్రీకృష్ణ సత్య’ (1971)లోనూ శ్రీకృష్ణ పాత్ర ధరించారు యన్టీఆర్. “వినాయకచవితి, దీపావళి, కర్ణన్, వీరాభిమన్యు, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణతులాభారము, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, దానవీరశూరకర్ణ” చిత్రాలలో శ్రీకృష్ణ పాత్రలో అనితరసాధ్యంగా అభినయించారు రామారావు. ఈ చిత్రాలలో కొన్ని తమిళంలోనూ రీమేక్ చేయగా, వాటిలోనూ రామారావే శ్రీకృష్ణ పాత్ర ధరించారు. ఇక “ఆత్మబంధువు, దేవుడు చేసిన మనుషులు, మా ఇద్దరి కథ” వంటి సాంఘికాలలోనూ, ‘గోపాలుడు-భూపాలుడు’ వంటి జానపదంలోనూ శ్రీకృష్ణునిగా తెరపై కనిపించి అలరించారు యన్టీఆర్. అలా మొత్తం పాతికసార్లు యన్టీఆర్ శ్రీకృష్ణునిగా తెరపై కనిపించి ఉంటారు. ఒకే పాత్రను ఒకే నటుడు అన్నిసార్లు ధరించి, తెరపై కనిపించడం అన్నది ప్రపంచ చరిత్రలోనే మరోచోట చూడలేము.
యన్టీఆర్ కంటే ముందు రోజుల్లో కపిలవాయి రామనాథ శాస్త్రి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, కళ్యాణం రఘురామయ్య వంటివారు శ్రీకృష్ణ పాత్రను పోషించి మెప్పించారు. వీరందరూ నటగాయకులు కాబట్టి, సందర్భానుసారంగా భావాలు పలికించారు. అయితే రామారావు వీరందరినీ మరిపిస్తూ తన అభినయంతో శ్రీకృష్ణ పాత్రలోని నవరసాలనూ కురిపించారు.
రామారావు తరువాత కృష్ణునిగా అనేక సార్లు తెరపై కనిపించిన ఘనత కాంతారావుదే. యన్టీఆర్ వేరే పాత్రలు పోషించిన “నర్తనశాల, పాండవవనవాసము, ప్రమీలార్జునీయం” వంటి చిత్రాలలో కృష్ణ పాత్రలో అలరించారు కాంతారావు. ఇక ‘పెళ్ళినాటి ప్రమాణాలు’లోనూ, ‘గోవుల గోపన్న’లోనూ ఏయన్నార్ పాటల్లో శ్రీకృష్ణుని గెటప్ లో కనిపించారు. ‘బుద్ధిమంతుడు’లో ఓ పాటలోనూ, ‘కురుక్షేత్రం’ పౌరాణికంలోనూ శోభన్ బాబు కృష్ణునిగా నటించారు. ‘అల్లూరి సీతారామరాజు’లో ఓ సీన్ లో కృష్ణుని గెటప్ లో కృష్ణ అభినయించారు. హరనాథ్, రామకృష్ణ, చక్రపాణి వంటివారు కూడా శ్రీకృష్ణ పాత్ర ధరించారు. యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ ‘మంగమ్మగారి మనవడు’లో “చందురుడు నిన్ను చూసి…” సాంగ్ లో శ్రీకృష్ణుని గెటప్ లో తొలిసారి కనిపించారు. తరువాత ‘పట్టాభిషేకం’లో “వేణుగాన లోలునికి…” అనే పాటలోనూ మరోమారు శ్రీకృష్ణ గెటప్ లో అలరించారు. తరువాత ‘శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు’ చిత్రాలలో శ్రీకృష్ణ పాత్రనే ధరించారు. నవతరం హీరోల్లో మహేశ్ బాబును వైవియస్ చౌదరి తన ‘యువరాజు’లో ఓ పాటలో కాసేపు కృష్ణునిగా చూపించే ప్రయత్నం చేశారు. యన్టీఆర్ నాలుగో తరం వారసుల్లో ఆయన పేరునే పెట్టుకున్న హరికృష్ణ మనవడు ఆ మధ్య వచ్చిన ‘దానవీరశూర కర్ణ’లో కృష్ణ పాత్రలో కనిపించాడు. ఏది ఏమైనా ఎందరు శ్రీకృష్ణ పాత్రను ధరించినా, కృష్ణుని పేరు తలచుకోగానే యన్టీఆర్ రూపమే తెలుగువారి మదిలో చప్పున మెదలుతుంది.