ఏ పదవులు చేజారి పరువు పోగొట్టుకున్నారో.. ఇప్పుడు అవే పదవులను పట్టేసి పట్టు నిలుపుకొన్నారట ఆ ఎమ్మెల్యే. హైకమాండ్ కూడా ఎందుకొచ్చిన గొడవ అనుకుందో లేక ఎమ్మెల్యేకే ప్రయారిటీ ఇవ్వాలనుకుందో.. మొదట్లో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా చేసింది. ఆలస్యంగానైనా పైచెయ్యి సాధించానని చెప్పుకొంటూ సదరు ఎమ్మెల్యే, ఆయన వర్గం జబ్బలు చరుచుకుంటోందట.
గెలిచిన కొత్తలో సఖ్యతగా ఉండేవారు!
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి జిల్లాలోనే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం. 2 లక్షల 50 వేల మంది ఓటర్లు. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. అందుకే ఎన్నికలప్పుడు అందరి దృష్టీ చింతలపూడిపై ఉంటుందంటే అతిశయోక్తి కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలీజాలు కొంతకాలం సఖ్యంగానే ఉన్నారు. శ్రీధర్ లోకల్ కావడం.. తన తండ్రి కోటగిరి విద్యాధరరావు గతంలో చింతలపూడి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవటంతో ఆ కుటుంబానికి అభిమానులు ఎక్కువ. ఎస్సీ నియోజకవర్గంగా మారిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులకు సాయం పడుతున్నారు కోటగిరి అభిమానులు. 2019 ఎన్నికల్లో IRS ఉద్యోగాన్ని వదులుకుని వైసీపీ నుంచి పోటీ చేశారు ఎలీజా. ఆయన నియోజకవర్గానికి నాన్ లోకల్. అయినప్పటికీ చింతలపూడి చరిత్రలోనే 36 వేల పైచిలుకు మెజారిటితో గెలిచారు.
సహకార సంఘాల త్రిసభ్య కమిటీలో ఎంపీ అనుచరులకు చోటు
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సర్కార్ త్రిమాన్ కమిటితో నామినేటడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ నామినేటెడ్ పదవులు అన్నీ దాదాపుగా ఎంపీ కోటగిరి శ్రీధర్ తన అనుయాయులకు ఇప్పించుకున్నారట. ఎమ్మెల్యే వర్గానికి, ఆయన చెప్పిన వాళ్లకు ఒక్కటీ రాలేదు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్‌కు ఈ నామినేటెడ్ పదవులు కూడా ఓ కారణమైందట.
అప్పట్లోనే హైకమాండ్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు
రెన్యువల్ సమయంలో పట్టు నిలుపుకొన్న ఎలీజా
ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఒక్క నామినేటెడ్ పదవి రాకపోవడంతో రగిలిపోయిన ఎలీజా ఈ విషయాన్ని హైకమాండ్ దగ్గర పెట్టారట. అంతేకాదు.. తనకే పట్టు ఉందని నిరూపించుకోవడానికి ఊరూరా తిరిగారు. గతం గతః అనుకున్న హైకమాండ్ తాజాగా మళ్లీ అవే నామినేటడ్ పదవులు రెన్యువల్ చేస్తూ ఎమ్మెల్యే ఎలీజా అనుచరులకు పదవులు కట్టబెట్టింది. ఇస్తే తాను చెప్పిన వారికే ఇవ్వాలని.. ఎంపీ వర్గానికి ఇవ్వొద్దని పార్టీ పెద్దలకు ఎమ్మెల్యే తెగేసి చెప్పారట. ఒక్క కామవరపుకోట టౌన్ సొసైటీ మినహా.. చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం ఇలా అన్ని మండలాల్లో తన అనుయాయులకే పదవులు ఇప్పించుకున్నారట. మొదట్లో పోయిన ఇజ్జత్‌ను ఈ విధంగా కవర్ చేసుకున్నారట ఎమ్మెల్యే ఎలీజా.