మనుగడ కష్టమైనచోట దుకాణం మూసేయడం కామన్. తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు ఇదే చేశాయి. కానీ.. ఆయన ఆలోచన వేరేలా ఉంది. ప్రజల్లో ఆదరణ తగ్గినా పార్టీని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారో లేక.. ఒక మనిషి ఆఫీస్‌లో ఉంటే చాలని భావించారో ఏమో తాళం తీసి.. తాళం వేసే వారికి బాధ్యతలు అప్పగించారని టాక్ నడుస్తోంది. ఆ పార్టీ ఏంటో? ఎవరో.. ఈ స్టోరీలో చూద్దాం.
బక్కని ఎంపికపై టీడీపీలో చర్చ లేదు.. ఆశ్చర్యం లేదు!
తెలంగాణలో టీడీపీ ఉందంటే ఉంది. ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉన్నారంటే ఉన్నారంతే. ఈ మాటలు చెప్పుకోవడానికే పనికొస్తాయి. ప్రజల్లో పార్టీకి పట్టు సడలిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీడీపీ ఖాళీ అనే చెప్పాలి. రాష్ట్ర విభజన నాటి నుంచి మొన్నటి వరకు టీటీడీపీని నడిపించిన ఎల్ రమణే గుడ్‌బై చెప్పేశారు. టీడీపీతో ఉంటే.. అధ్యక్ష పదవి మాత్రమే చేతిలో ఉంటుంది. నాయకులకు రాజకీయాల్లో అదొక్కటే పరమావధి కాదు. ఎన్నికల్లో కొట్లాడాలి. గెలవాలి… అధికారం చేపట్టాలి.. పదవుల్లో ఉండాలి. వీటి కోసం వేచి వేచి చూసిన.. ఎల్ రమణ సైకిల్‌పై టీడీపీ లోడ్ ఎత్తలేమని భావించి.. కారులో ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎల్ రమణ ప్లేస్‌లో టీటీడీపీ చీఫ్‌గా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు వచ్చారు. సాధారణంగా చంద్రబాబు నిర్ణయాలపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఆశ్చర్యాలు వ్యక్తం అవుతాయి. కానీ.. బక్కని ఎంపిక విషయంలో అలాంటివి ఏమీ లేవంటే.. తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ ముఖం చూసిన వాళ్లే లేరు
2018 ఎన్నికల్లో టీడీపీకి ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. వారిద్దరూ టాటా బైబై గుడ్‌బై అంటూ టీఆర్‌ఎస్ గూటిలోకి వెళ్లిపోయారు. ఇక GHMC ఎన్నికల్లో గుండు సున్నా. గతంలో జరిగిన GHMC ఎన్నికల్లో ఒక్కటైనా సీటు వచ్చింది. ఇప్పుడు అది కూడా లేదు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పటిష్ఠంగా కనిపిస్తున్నా.. ఆపాటి పటిష్టత టీడీపీలో లేదు. ఒకప్పుడు కార్యకర్తలు.. నాయకుల రాకపోకలతో కళకళలాడిన పార్టీ ఆఫీస్.. ఇప్పుడు ఎవరోస్తారా.. తాళం ఎవరు తీస్తారా అని ఎదురు చూడాల్సిన దుస్థితి.
కష్టమో.. నష్టమో టీ టీడీపీని కంటిన్యూ చేయాలనే ఆలోచన!
తెలంగాణలో ప్రతికూల వాతావరణం ఉన్న సమయంలో తెలుగుదేశం మనుగడ కష్టమే అన్నది పార్టీ వర్గాల మాట. ఇంకా ఎందుకు… దుకాణం మూసేయొచ్చగా అని వైరి పక్షాలు అప్పుడప్పుడు సెటైర్లు వేస్తుంటాయి. కానీ.. కష్టమో.. నష్టమో తెలంగాణలో టీడీపీని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. అందుకే ఎల్ రమణ స్థానాన్ని బక్కని నర్సింహులతో భర్తీ చేశారని అనుకుంటున్నారు.
పార్టీని నడిపించేందుకు ఒక్కరు ఉంటే చాలా?
టీడీపీలోనే ఉన్న ఒకరిద్దరు ముఖ్య నాయకులను అధ్యక్ష పదవి చేపట్టాలని చంద్రబాబు కోరినా.. వారు నిరాకరించారట. దీంతో ఇంకెవరినో సారథిని చేసి.. రేపటి రోజున వారు అధ్యక్ష హోదాలో పార్టీని వీడి వెళ్లే అవకాశం ఎందుకు ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారట. బక్కని అయితే అవివాహితుడు… దళితుడు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని కొనసాగుతుండటంతో ఆయనవైపు మొగ్గు చూపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ తలుపులు తీసి.. ఆఫీస్‌లో ఒకరు కూర్చుంటే చాలు. టైమ్ వచ్చినప్పుడు చూద్దాం. వైరిపక్షాలు ఆశిస్తున్నట్టు దుకాణం మూసేయడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారట. పార్టీ బలోపేతం కన్నా.. ముందు తెలంగాణలో టీడీపీ అనేది ఒకటి ఉంది అని చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలన్న దానికే ప్రాధాన్యం ఇచ్చారట. మరి.. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా బక్కని అడుగులు వేస్తారో.. రాజకీయ భవిష్యత్ కోసం మథన పడతారో చూడాలి.