మొన్నటి వరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు రావడం లేదని చర్చ జరిగింది. ఇప్పుడేమో వస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదట. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ గుర్తించినా.. ముందు వరసలో తళుక్కుమంటున్నా.. ఆయన ఒకరు ఉన్నారన్న సంగతే ఎవరికీ తెలియడం లేదట. చిర్రెత్తుకొచ్చిన ఆ నాయకుడు పార్టీ ఇంఛార్జ్‌కి ఫోన్ చేసి ఓ రేంజ్లో అందుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా గొడవ?
పార్టీ నేతలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు!
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరి స్టైల్ వారిది. అధిష్ఠానానికి దగ్గరైతే.. లోకల్ నాయకులను పట్టించుకోరు. పీసీసీకి దగ్గరైతే ఎవరినీ లెక్క చేయరన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఇదే అంశంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కి ఫోన్ చేసి మరీ ఫిర్యాదు చేశారట. అజ్జుభాయ్ గతంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది తక్కువే. గడిచిన కొంత కాలంగా.. ప్రతి సమావేశానికీ.. సభలకు.. దీక్షలకు మిస్ కాకుండా వస్తున్నారు. దీంతో తనకు ప్రయారిటీ రాలేదని కొన్నిచోట్ల.. సభల నిర్వాహకుల తీరుపై మరికొన్నిచోట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆ అంశాలపైనే ఫిర్యాదుల వరకు వెళ్లారట అజ్జూభాయ్.
రావిర్యాల సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు!
రావిర్యాలలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా సభ నిర్వహణపై పార్టీలో ఎక్కువమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. పేరుకు రంగారెడ్డిజిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షత వహించిన ఆ సభలో.. అంతా నడిపించింది పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి. నాటి వేదికపై అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మల్లు రవి పీసీసీ చీఫ్‌కు దగ్గర మనిషి. అందుకే సభలో మాట్లాడే అవకాశం రానివారంతా.. పీసీసీ చీఫ్‌ను టార్గెట్ చేస్తూ ముప్పేట దాడిచేశారు. ఆ రోజు సభకు అజారుద్దీన్ వచ్చినా ఆయనకు మైక్ ఇవ్వలేదు. దీంతో అజ్జూభాయ్ రగలిపోయారట.
ఇంఛార్జ్ ఠాగూర్‌కు ఫోన్ చేసి ఫైర్ అయ్యారా?
మూడు చింతల సభ ఏర్పాట్ల కోసం అజారుద్దీన్ అక్కడికి వెళ్లారు. అక్కడ ప్రెస్‌మీట్ పెట్టిన మల్లు రవి.. అందరితో మాట్లాడించారు. అప్పటి వరకు ఓపికగా ఉన్న అజారుద్దీన్ వెంటనే పార్టీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు ఫోన్ చేసి ఇదేం పద్ధతి అని నిలదీశారట. పార్టీ వేదికలపై తనకు జరుగుతున్న అవమానాలను ఏకరవు పెట్టారట. అవకాశం ఇవ్వాల్సినచోట ఇవ్వకుండా.. ఐదారు నిమిషాల్లో ముగించాల్సి సమావేశాన్ని గంటలకొద్ది నిర్వహించడం ఏంటని ఫైర్ అయ్యారట అజారుద్దీన్.
మాజీ క్రికెటర్‌ను వైరివర్గంగా భావిస్తున్నారా?
ఈ కొత్త పంచాయితీ గురించి తెలియగానే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది. అజారుద్దీన్‌ను ఎందుకు గుర్తించడం లేదు? అజారుద్దీన్‌ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం.. పీసీసీ చీఫ్‌కు ఇష్టం లేదా? అందరినీ కలుపుకొని వెళ్తానన్న సారథి.. కొందరికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? ఈ మాజీ క్రికెటర్‌ను వైరివర్గంగా భావిస్తున్నారా? ఇలా గాంధీభవన్‌కు వస్తున్న పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయట. అజ్జూభాయ్ కంప్లయింట్‌పై ఠాగూర్ ఏమన్నారో? ఏం చేస్తారో అన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో ఉంది. మరి.. అజారుద్దీన్ ఇక్కడితో ఆగుతారా? లేక హైకమాండ్ వరకు వెళ్తారో చూడాలి.