కండువా మార్చినా ఫేట్ మారలేదు. చిన్న పని కూడా కావడం లేదు. పార్టీ పెద్దలు గుర్తించినా లోకల్‌గా ఎమ్మెల్యేతో నిత్యం పోరాటమే. చికాకు తప్ప సంతృప్తి లేదు. చివరకు సొంత గూటిని వదిలి వచ్చి తప్పు చేశామా అని పునరాలోచనలో పడ్డారట ఆ మాజీ మంత్రి. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన ఉన్నట్టు టాక్. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ?
మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పునరాలోచనలో పడ్డారా?
ఫ్యాక్షన్ రాజకీయాలతో ఒకప్పుడు అట్టుడికిన కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు 2019 ఎన్నికల తర్వాత అనేక మలుపు తిరిగాయి. నువ్వానేనా అని తలపడిన నాయకులు బ్యాక్ బెంచీకి పరిమితమై కొత్త లీడర్ సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం జమ్మలమడుగును కనుసైగతో శాసిస్తున్నారు సుధీర్‌రెడ్డి. మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి.. ఆదినారాయణరెడ్డిల హవా పొలిటికల్ స్క్రీన్‌పై గతంలోలా లేదు. వరస ఓటములతో కుంగిపోయిన రామసుబ్బారెడ్డి.. ఎన్నికల తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. వైసీపీ అధికారంలో ఉండటం.. పార్టీ పెద్దలు ఆశీస్సులు కలిసి వస్తాయని ఆయన లెక్కలేసుకున్నారు. అయితే లోకల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో మాజీ మంత్రికి అస్సలు పడటం లేదు. ఈ వర్గపోరే రామసుబ్బారెడ్డిని పునరాలోచనలో పడేసినట్టు చర్చ జరుగుతోంది. తిరిగి టీడీపీలోకి వెళ్లిపోతారని అనుకుంటున్నారట.
వైసీపీలో చేరినా పరిస్థితిలో మార్పు లేదా?
ఒకప్పుడు టీడీపీలో ఎదురులేని నాయకుడిగా ఉన్న రామసుబ్బారెడ్డి పరిస్థితి.. ప్రస్తుతం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది వాపోతున్నారట అనుచరులు. వైసీపీలో చేరాక ఏం సాధించామన్న మీమాంసలో మాజీ మంత్రి పడినట్టు తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన రామసుబ్బారెడ్డి కుటుంబం.. ఒకానొక సమయంలో రాజకీయ ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డితోనూ కలిసి ప్రయాణం చేసింది. అప్పుడు కూడా టీడీపీలో ఈస్థాయిలో డీలా పడిన సందర్భాలు లేవని అనుయాయులు గుర్తు చేస్తున్నారు. వైసీపీలో చేరాక పూర్వ వైభవం వస్తుందని అనుకుంటే.. పూర్తిగా రివర్స్‌లో ఉందంటున్నారు మాజీ మంత్రి అనుచరులు.
వరస అవమానాలతో రగిలిపోతున్నారా?
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్యకు వైసీపీ పెద్దలు చేయని ప్రయత్నం లేదు. చేతులు కలిపారు.. కలిసి పనిచేయాలని సూచించారు. కానీ.. మాజీ మంత్రి నీడను కూడా ఎమ్మెల్యే దగ్గరకు రానివ్వడం లేదు. వివిధ కార్యక్రమాల్లో రామసుబ్బారెడ్డికి అవమానాలే ఎదురయ్యాయి. రోజు రోజుకీ అవమానాలు ఎక్కువ అవుతున్నాయి తప్ప.. పరిస్థితులు సద్దుమణుగుతాయన్న నమ్మకం పోతోందట. పైగా 2024లో సుధీర్‌రెడ్డే పోటీ చేస్తారని పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ విషయం తెలిసిన వెంటనే రామసుబ్బారెడ్డి వైసీపీని వీడి వెళ్లిపోతారని చర్చ మొదలైనా.. వాటిని కొట్టిపారేశారు మాజీ మంత్రి. ఇప్పుడు మాత్రం అలా లేదట.
టీడీపీలోకి వెళ్లిపోదామని కేడర్ ఒత్తిడి చేస్తోందా?
జమ్మలమడుగులో మాజీ మంత్రిని ఎవరూ పట్టించుకోవద్దని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెప్పారట. దాంతో ఇక వైసీపీలో ఉండి ప్రయోజనం ఏంటని రామసుబ్బారెడ్డి ప్రశ్నించుకుంటున్నారట. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కడపలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి వెళ్లలేదు. అప్పటి నుంచి ఆయన వైసీపీలో ఉంటారా లేదా అన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. కేడర్ కూడా ఆయనపై ఒత్తిడి చేస్తున్నారట. దీంతో రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తనను గౌరవించే టీడీపీలోకే తిరిగి వెళ్లే ఆలోచనలో రామసుబ్బారెడ్డి ఉన్నట్టు టాక్. వైసీపీలోని కొందరు నాయకులు కూడా మాజీ మంత్రి విషయంలో ఇదే కోరుకుంటున్నారట. మరి.. జమ్మలమడుగు రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి.