అది క్రీడా గ్యారేజ్…! అక్కడ చాంఫియన్‌లు తయారు చేయబడును..! అవును ఒలింపిక్స్ గేమ్స్ వచ్చిన ప్రతిసారి పతకాల పట్టికలో భారత్ ఎక్కడుందో చూసుకునేవాళ్లం..! కానీ ఇప్పుడు భారత్‌కి మెడల్స్ సాధించిన పెట్టిన వాళ్లలో ఆ రాష్ట్రం ఆటగాళ్లు ఎంతమంది అనేది ఇప్పుడు లెక్కేసుకుంటున్నాం…! ఎందుకంటే గత కొద్దికాలంగా అక్కడి ఛాంపియన్‌లు ప్రతిచోట మువ్వెన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు..!
భారతీయుల బంగారు కలను సాకారం చేశాడు నీరజ్‌చోప్రా..! సొంతూరు పానిపట్.. రాష్ట్రం.. హర్యానా…. రెజ్లింగ్‌లో ఫైనల్ వరకు వెళ్లి వెండి పతకం అందించాడు రవి కుమార్ దహియా…. జిల్లా… సోనిపట్ ..రాష్ట్రం.. హర్యానా… ఇదే రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్నిందించిన భజరంగ్‌పూనియాది కూడా హర్యానానే..!
దేశానికి వచ్చిన ఏడు మెడల్స్‌లో మూడు హర్యానా ఆటగాళ్లే అందించారు. చిన్న రాష్ట్రమైన హర్యానా క్రీడల్లో దేశంలో అగ్రభాగాన నిలుస్తోంది. ఇదే కాదు..గతంలో పతకాలందించిన వాళ్లలోనూ హర్యానా క్రీడాకారులే అధికంగా ఉన్నారు.. మరి ఈ రాష్ట్రం ఏ ఎందుకంత స్పెషల్…?
ఇక్కడి ఛాంపియన్‌లు రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ క్రీడల విధానం..! ఇక్కడ మారుమూల ప్రాంతాల్లోనూ క్రీడలకు సంబంధించి మౌలిక సౌకర్యాలు ఏర్పాటుచేశారు. 22 జిల్లాల్లో అనేక క్రీడా నర్సరీలను నెలకొల్పారు. అంబాలాలో భారీ స్టేడియం ఉంది. దీంతో ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఏర్పడుతోంది.
దానికి తోడు మెడల్ కొట్టు… జాబ్ పట్టు అంటోంది అక్కడి సర్కార్. నిజానికి హర్యానాలో కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అలాగే ఉంది. దీంతో చిన్న వయసులోనే క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ సర్కారీ లభిస్తుందన్న విశ్వాసం యువతలో ప్రబలంగా ఉంది. ప్రభుత్వం సైతం పతకాలు తెచ్చుకున్న క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడంతో యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
అందుకే ఇది ఛాంపియన్‌ల ఫ్యాక్టరీ…! గత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 66 మెడల్స్ సాధిస్తే ఈ రాష్ట్రం వాటా 22. ఇదే కాదు.. దేశవాళీ క్రీడల్లోనూ వీళ్లు సత్తా చూపుతున్నారు. 1983లో తొలిసారి భారత్ క్రికెట్‌లో వరల్డ్‌కప్ గెలిచింది. ఆ సమయంలో భారత క్రికెట్ సారథి కపిల్‌దేవ్ ఇక్కడివారే..! ఆయన్ను హర్యానా హరికేన్ అని పిలుచుకుంటారు అభిమానులు. బాక్సింగ్ సంచలనం విజేంద్రసింగ్, కుస్తీలో ఫొగట్ సోదరీమణులు.. ఇలా చాలా లిస్ట్ ఉంది. రెజ్లింగ్‌లో దేశానికి ప్రతినిధ్యం వహిస్తున్నారంటే వాళ్ల మూలాలు హర్యానాలో దొరుకుతాయ్…! అంతలా ఆ రాష్ట్రం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే అక్కడి నుంచి మెరికలు వస్తున్నారు.