గరం గరం పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన గన్నవరంలో టీడీపీ కేడర్‌కు కష్టమొచ్చిందట. అక్కడ పార్టీ ఇంఛార్జ్ ఉన్నా.. కేడర్‌కు లీడర్ కొరత మాత్రం తీరలేదని టాక్. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని చర్చ జరుగుతోంది. ఈక్వేషన్లు కుదరడం లేదట. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
గన్నవరం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న బచ్చుల అర్జునుడు
ఏపీలోని టీడీపీ కంచుకోట నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. 2019 వైసీపీ గాలిలోనూ ఇక్కడ టీడీపీ గెలిచింది. కృష్ణా జిల్లాలో రెండుచోట్ల టీడీపీ గెలవగా.. అందులో ఒకటి గన్నవరమే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి జైకొట్టారు. దీంతో కేడర్ సైతం వంశీ, టీడీపీ వర్గాలుగా విడిపోయింది. అయినప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ కేడర్ బలంగానే ఉందని గుర్తించిన పార్టీ పెద్దలు బలమైన ఇంఛార్జ్‌ను పెట్టడానికి పెద్ద కసరత్తే చేసింది. చివరకు మచిలీపట్నానికి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని టీడీపీ ఇంఛార్జ్‌ను చేశారు.
గన్నవరానికి టీడీపీ ఇంఛార్జ్‌గా బచ్చుల సరిపోరని పార్టీలో టాక్!
ఎమ్మెల్యే వంశీ.. వైసీపీకి దగ్గరైన తర్వాత చానాళ్లపాటు గన్నవరానికి ఇంచార్జ్‌ను ప్రకటించలేదు టీడీపీ. ఇప్పుడున్న ఇంఛార్జ్ అర్జునుడు స్థానికుడు కాకపోయినప్పటికీ.. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఓకే చెప్పారు. బీసీ నేత కావడంతో వర్కవుట్ అవుతుందని అనుకున్నారట. కానీ.. అర్జునుడు వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. కేడర్‌ను కలుపుకొని వెళ్లలేకపోతున్నట్టు టాక్. చివరకు ఆయన గన్నవరానికి సరిపోరనే చర్చ పార్టీ వర్గాల్లోనే మొదలైందట.
ఎమ్మెల్యే వంశీపై విమర్శలు చేయలేకపోతున్నారా?
ఆర్థికంగా గన్నవరానికి బచ్చుల సరిపోరని ప్రచారం!
బచ్చుల కేవలం బీసీ నేతగా అధిష్ఠానం ఆదేశాలతో గన్నవరానికి వచ్చారు. ఇక్కడ గెస్ట్ అప్పీరియన్స్ తప్ప సీరియస్‌గా నియోజవర్గంపై ఫోకస్ పెట్టడం లేదట. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీపై బచ్చుల ఎక్కడా విమర్శలు కూడా చేయలేకపోతున్నట్టు తమ్ముళ్ల వాదన. కేవలం పేరుకే ఇన్చార్జిగా వ్యవహరిస్తూ డేత్‌డేలు. .బర్త్‌డేలకు మాత్రమే పరిమితం అవుతున్నారట. పార్టీ బలోపేతం, క్యాడర్ కోసం ఏమీ చేయటంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థికంగా కూడా బచ్చుల అర్జునుడు గన్నవరానికి సరిపోరనేది నియోజకవర్గ టీడీపీ నేతల అభిప్రాయమట.
వంశీని ఎదుర్కోవాలంటే బలమైన వ్యక్తి కావాలని ప్రచారం!
గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన దాసరి బాలవర్థనరావు, వంశీమోహన్‌లు ఆర్థికంగా బలంగా ఉండటంతోపాటు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా స్ట్రాంగ్ హోల్డ్ సంపాందించారనే ప్రచారం ఉంది. బచ్చులకు అవి సాధ్యం కాబోవని.. అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లిందట కేడర్. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో బలంగా ఉన్న వంశీని ఎదుర్కోవాలంటే బలమైన వ్యక్తిని పార్టీ ఇంఛార్జ్‌గా పెట్టాలని క్యాడర్ కోరుతోందట. మరి తెలుగు తమ్ముళ్ల వినతులపై టీడీపీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.