దేవాదాయశాఖ పేరు వింటేనే పవిత్రభావం కలగాలి. కానీ.. అక్కడ జరగని అరాచకం లేదు. అలా జరగకుండా చూడాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. మహాఅయితే తూతూ మంత్రంగా మమ అనిపించేస్తున్నారు. క్రమశిక్షణ ఉండాల్సిన శాఖ కట్టుతప్పడానికి రాజకీయ అండదండలేనట. వివాదాస్పదంగా మారిన వారిపై చర్యలు తీసుకోవడానికి పైవాళ్లు జడిసే స్థాయిలో నేతల మద్దతును వీళ్లు కూడగట్టారట.
దేవాదాయశాఖలో తప్పు జరిగితే చర్యలు ఉండవ్!
ఏపీ దేవాదాయశాఖ గాడి తప్పిందా? ఏదో ఒక గొడవ లేదా ఇంకేదో వివాదం.. అవినీతితో శాఖ పరువు బజారున పడుతోందా? ఉద్యోగులు తప్పుమీద తప్పులు చేస్తున్నా.. ఉన్నతాధికారులు కంట్రోల్ చేయలేకపోతున్నారా? ప్రస్తుతం ఈ విమర్శల సుడిలోనే చిక్కుకుంది దేవాదాయశాఖ. ఇటీవల జరిగిన పరిణామాలు శాఖ పనితీరును తెలియజేస్తున్నాయని ఉద్యోగవర్గాల ఓపెన్ టాక్. కొందరు ఉద్యోగుల తీరు ఎంత దారుణంగా ఉందో.. ఆ శాఖ ఉన్నతాధికారుల తీరు కూడా అంతే దారుణంగా ఉందని చెబుతున్నారు. తప్పు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ.. ఆ స్థాయిలో చర్యల్లేవ్. పైగా వెనకా ముందు ఆలోచించడం ఎక్కువైంది.
ఇసుక దాడిపై రాష్ట్రంలో చర్చ!
అధికారులను పిలిచి మందలించి పంపారు!
విశాఖలో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్‌ల మధ్య ఇసుక దాడి సంచలనం సృష్టించింది. ఒక అధికారి ఛాంబర్‌లోకి ఇంకో అధికారి వెళ్లి ముఖాన ఇసుక కొట్టిన ఉదంతాలు ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడా ఘనత దేవాదాయశాఖకు దక్కింది. విశాఖ కేంద్రంగా సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ భూములకు సంబంధించి కీలక విచారణ జరుగుతోంది. అందరి దృష్టి ఆ వ్యవహరాలపై ఉండగా జరిగిన ఈ ఘటన ఆశ్చర్య పరిచింది. ఈ ఘటనలో తప్పు ఎవరిదనే విషయాన్ని తేల్చి.. చర్యలు తీసుకుంటే బాగుండేదనే భావన వ్యక్తమైంది. కానీ అలాంటిదేం లేకుండా.. వారిని కమిషనర్ ఆఫీస్‌కు పిలిచి.. మందలించి పంపేశారు. ఇదంతా టీ కప్పులో తుఫాన్ అనే రీతిలో ఉన్నతాధికారులు లైట్‌గా తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల డిపార్ట్‌మెంట్‌లో మరింతమంది నిర్లక్ష్యంగా ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోందట.
ద్వారకా తిరుమలలో ఏఈవో మృతిపై రగడ!
విశాఖ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలోనే పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల రగడ చర్చల్లోకి వచ్చింది. ఆలయ ఈవో అందరి ముందూ దూషించడం వల్లే ఏఈవో మనస్తాపం చెంది గుండెపోటుతో చనిపోయినట్టు ఆరోపణ. ఈవో తీరును తప్పుపడుతూ ఆలయ ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. ఈ అంశంపైనా దేవాదాయశాఖలో చర్చ జరుగుతోంది. వాస్తవాలు ఏమైనా శాఖ కట్టు తప్పిందన్నది ఉద్యోగులు చెప్పేమాట.
చర్యలు తీసుకోవడానికి జంకుతున్న ఉన్నతాధికారులు?
చర్యలు తీసుకుంటారన్న భయం ఉద్యోగుల్లో పోయిందా?
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. హెచ్చరికలు పనిచేయడం లేదు. దీంతో ఏం చేసినా తమకేం కాదనే వారి సంఖ్య పెరుగుతోందట. కిందిస్థాయి ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి జంకితే ఎలా అన్నది కొందరి ప్రశ్న. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల అండతో పేట్రేగిపోతున్న సిబ్బందికి శాఖలో కొదవ లేదన్నది ఓపెన్ టాక్. తప్పు చేయడానికి వెనకాడటం లేదు. తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటారన్న భయం పోయింది. దీనికి ఒక్కరు కారణం అని అనలేం. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టగలం. దేవాదాయశాఖలో జరుగుతున్న పరిణామాలకు కూడా అదే కారణమట. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవాదాయశాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయలనే అభిప్రాయం కలుగుతోందట. అది సాధ్యమా? ఆ సాహసం ఎవరు చేస్తారు?