ఏపీలో ఉన్న వైసీపీది మతతత్వ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆత్మకూరులో అనుమతి లేకుండా రెండు రోజుల్లో ఇళ్ల మధ్య మసీదులు కట్టారని, ఇళ్ల మధ్య మసీదు వద్దని చెబితే చంపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎంతోమందిని భయబ్రాంతులకు గురి చేశారని, చట్టాన్ని రక్షించాల్సిన ఉప ముఖ్యమంత్రి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేస్తామని, టీడీపీ నుండి బీజేపీకి వచ్చిన నేతలను కోవర్టులు అనటం సరికాదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్, మోదీతో పొత్తు పెట్టుకుని నల్ల జెండాలు చూపించారని, బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎన్నికలు జరిగే అన్నీ రాష్ట్రాల్లో అధికారం సాధిస్తామని, ఏపీలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. పీఆర్సీ అర్ధం కాని బ్రహ్మ పదార్ధం అయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే అవసరం ఉండదనే ఉద్యోగులకు వయో పరిమితి పెంచారన్నారు.