హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై పలు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే కరోనా కారణంగా వీటి షూటింగ్స్ కు బ్రేక్ పడింది. తాజాగా తెలంగాణలో సంపూర్ణంగా లాక్ డౌన్ ఎత్తివేయడం, కొవిడ్ 19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఫిల్మ్ ఛాంబర్ నిర్దేశించిన సూచనలను అనుసరిస్తూ పలు నిర్మాణ సంస్థలు షూటింగ్స్ మొదలు పెట్టాయి. సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సైతం తమ చిత్రాలను తిరిగి పట్టాలెక్కించడం మొదలు పెట్టారు.
గురువారం ఈ బ్యానర్ లోని రెండు సినిమాల షూటింగ్స్ తిరిగి మొదలయ్యాయి. అందులో మొదటిది ‘వరుడు కావలెను’. యంగ్ హీరో నాగశౌర్య, రీతువర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, ‘రంగస్థలం’ మహేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ క్యూట్ లవ్ స్టోరీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయ్యింది. నేటి నుండి తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లో జరుపుతున్నారు. ఈ యేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన గీతానికి మంచి స్పందన వచ్చిందని; కథ, కథనం, మాటలతో పాటు నటీనటుల అభినయం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. గణేశ్ కుమార్ రావూరి సంభాషణలు అందిస్తున్న ‘వరుడు కావలెను’ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు.
ఇదే బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మరో సినిమా ‘నరుడి బ్రతుకు నటన’. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో జంటగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లోనే ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీ విడుదలైంది. ఆ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్ కృష్ణ ఇప్పుడీ ‘నరుడి బ్రతుకు నటన’తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాలభైరవ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాకు విమల్ కృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ రచన చేశారు. ఈ రెండు సినిమాలకూ పీడీవీ ప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం తెలుగు రీమేక్ షూటింగ్ జూలై రెండవ వారంలో మొదలు కానుంది. దీనికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.