తెలుగు చిత్ర పరిశ్రమ సాహిత్య శిఖరం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈ నెల 24న న్యుమోనియాతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో సిరివెన్నెల మృతితో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సిరివెన్నెల పార్థివ దేహాన్ని సందర్శించేందుకు అనువుగా రేపు ఉదయం 7గంటలకు ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. అనంతరం సిరివెన్నెల అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సిరివెన్నెల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేపు వేలాదిగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్ననేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.