సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయం విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.. ఈ నేపథ్యంలో పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒళ్లంతా బురద చల్లుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. తమ పాలిట గుదిబండ అయ్యారని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ పవన్ కల్యాణ్ గురించి అనుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఇక, సినిమా టికెట్ల ఆన్‌లైన్ వ్యవహారంపై స్టేక్ హోల్డర్లు అంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సినిమాలతో వచ్చిన ఆదాయం అంతా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు వెళ్లడం లేదన్నారు. ఆన్‌లైన్ వస్తే అలాంటి మెసాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుని, దొంగ లెక్కలతో లబ్ధిపొందుతున్న కొద్ది మందే ఆందోళన చెందుతున్నారంటూ ఎద్దేవా చేసిన ఆయన.. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థలో ప్రభుత్వానిది సహకార పాత్ర మాత్రమే అన్నారు.. ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థను సినీ ప్రముఖులంతా ఆహ్వానిస్తున్నారని తెలిపిన సజ్జల.. టిక్కెట్ల రాబడితో ప్రభుత్వం లోన్లు తీసుకుంటారనడం అసంబద్ధమైన వ్యవహారంగా కొట్టిపారేశారు. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవహారంలో ప్రభుత్వం ముందుకే వెళ్తుందని.. దీనిపై వారం పది రోజుల్లో విధి విధానాలు వచ్చే అవకాశం ఉందన్నారు.. పారదర్శకంగా ఆన్ లైన్ వ్యవస్థ ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని వెల్లడించారు. సినిమా థియేటర్లు నడిపే వ్యవహారం మాఫియాలాగా నడుస్తోందని.. సినీ పెద్దలతో సమావేశానికి ఎప్పుడైనా సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీనికోసం సినీ పెద్దలు ఎప్పుడు వచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.