సినిమా టికెట్ల ఆన్‌లైన్ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. ఆ తర్వాత ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. పోసాని కృష్ణ మురళి కూడా ఘాటుగా స్పందించాడు.. వీటి అన్నింటికీ కలిపే అదేస్థాయిలో మళ్లీ కౌంటర్ ఎటాక్ చేశారు పవన్.. అయితే, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడి నేను ఆ స్థాయి దిగజారదలుచుకోలేదంటూ కామెంట్ చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కానీ, మూడు, నాలుగు నెలలకోసారి రాష్ట్రానికి వచ్చి షో చేసి వెళితే లాభం ఉండదంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కెమెరా, యాక్షన్ అన్నట్లు ఉంటుంది ఆయన వ్యవహారం అని.. ఎవరో వస్తున్నారని ఉలిక్కిపడి ఏదో చేయాల్సిన అవసరం మాకు లేదని.. వాళ్లు అలా భ్రమల్లో ఉంటే ఏం చేయలేమన్నారు.
ఇక, ఒక గుంత కనిపించగానే ఫోటోలకు ఫోజులు ఇవ్వాలనుకుంటే మేం ఆహ్వానిస్తాం అంటూ సెటైర్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. మీడియాలో చర్చలకు, ప్రచారానికి పరిమితం అవ్వాలనుకుంటున్నట్టుగా ఉంది వారి వ్యవహారమన్న ఆయన.. చంద్రబాబు హయాం కంటే చాలా మెరుగ్గా రోడ్ల నిర్మాణం, నిర్వహణ ఈ ప్రభుత్వం చేస్తోందన్నారు.. అయినా, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడి ఆ స్థాయికి దిగజారదలుచుకోలేదని ఎద్దేవా చేశారు. ఈ కాలు కుంటి ఆ కాలు కుంటి లాంటివి ఈ జతకట్టడాలు.. ఎవరో ఒకరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితిలో వాళ్లు ఉన్నారని.. వైఎస్ జగన్ సమర్ధత వల్ల మేం ప్రజల విశ్వాసం పొందగలుగుతున్నామన్నారు. ఇక, జనసేన, టీడీపీ కలిసి పోటీచేసే ఆలోచనలో ఉన్నారేమో.. అలాంటి వార్తలు కూడా వస్తున్నాయన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.