ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజంపేట మండలంలో వాగులు, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. రామాపురం చెయ్యేరు నదిలో రెండు ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు ఇరుక్కుపోయాయి. ఓ బస్సులోని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. మరో బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో బస్సు పైకి ఎక్కారు. తమను కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు.
మరోవైపు జిల్లాలోని సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 5 గేట్లు ఎత్తి 48వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. పింఛా ప్రాజెక్టు రింగ్ బండ్ తెగిపోవడంతో ఊహకు అందని స్థాయిలో దిగువన ఉన్న అన్నమయ్య ప్రాజెక్టులోకి వరదనీరు పోటెత్తుతోంది.