నాలుగు రోజులుగా కోడిపుంజులు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాయి. వాటికి బియ్యం అందిస్తూ పోలీసులు జాగ్రత్తగా చూస్తున్నారు. వాటి రంగుల ఆధారంగా మూడు పుంజులను త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలోని దంతలబోరు శివారులోని అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కోడిపందేలకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందేలు నిర్వహిస్తున్న వారిని, మూడు కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయితే, కోళ్లను మాత్రం పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. కోర్టులో హాజరుపరుస్తామని, తదుపరి ఆదేశాల తరువాత చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.